సిటీబ్యూరో, జూన్ 25 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీలో స్టాండింగ్ కమిటీ సమావేశాలకు మంగళం పాడారు. ప్రతి వారంలో బుధవారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన అన్ని పార్టీలకు సంబంధించిన సభ్యులు, కమిషనర్, అదనపు కమిషనర్లు, జోనల్ కమిషనర్లు, ఆయా శాఖల ముఖ్య అధికారులు కలిసి అభివృద్ధి, జంక్షన్లు, చెరువుల సుందరీకరణ, మురుగునీటి మళ్లింపు, పార్కులు, సెంట్ర ల్ మీడియంలను కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బులిటీ కింద అభివృద్ధి చేయడం లాంటి కీలక అంశాలపై స్థాయీ సంఘం సభ్యులు చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. అయితే ఇటీవల పార్లమెంట్ ఎన్నికల కోడ్ రావడంతో వారంలో జరిగే స్టాండింగ్ కమిటీ సమావేశాలకు తాత్కాలిక బ్రేక్ పడింది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల కోడ్ ముగిసి 20 రోజులు అవుతున్నా… సమావేశంపై ఉలుకు పలుకు లేదు. రొనాల్డ్‌రాస్ 15 రోజుల పాటు సెలవులో ఉన్నారన్న కారణంతో సమావేశాలను మేయర్ నిర్వహించలేదు. అయితే ఇన్చార్జి కమిషనర్ ఆమ్రపాలికి జీహెచ్ఎంసీ కమిషనర్‌గా పూర్తి బాధ్యతలను అప్పగించింది. ఎజెండాలను సిద్ధం చేసి ఈ వారంలో స్టాండింగ్ కమిటీ ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ కనీసం ఆ దిశగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఈ క్రమంలో వచ్చే వారంలోనే స్టాండింగ్ కమిటీ సమావేశాలు ఉంటాయా? లేక వాయిదాల పర్వాన్ని కొనసాగిస్తారా? అన్నది వేచి చూడాల్సిందే. మొత్తంగా ప్రతి వారంలో రూ. రెండు కోట్ల నుంచి రూ. 3 కోట్ల మేర విలువైన పనులకు బ్రేక్ పడనుండటంతో సమస్యలు మరింత జఠిలమవుతున్నాయి. అభివృద్ధి పనులపై నిర్లక్ష్యం చేయడం పై ప్రజలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.