ఖైరతాబాద్, ఫిబ్రవరి 9 : లాకప్ డెత్ మృతుడు కర్ల రాజేశ్ కేసును పోలీసు ఉన్నతాధికారులు, పాలకులు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 90 రోజులుగా ఈ కేసులో పురోగతి రావడం లేదని, బాధిత కుటుంబానికి న్యాయం జరుగడం లేదన్నారు. నాడు అక్రమ నిర్బంధం, చిత్రహింసలపై నోరు మెదపని అధికారులు ఆయన మరణానికి తాము కారణం కాదని, గుండెపోటుతో చనిపోయాడని పోస్టు మార్టం రిపోర్టుగ తయారు చేయించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ రిపోర్టు ఇంకా పెండింగ్‌లో ఉండగా, గుండెపోటుతో చనిపోయారని ఎలా చెబుతారని ప్రశ్నించారు.
ఇప్పటి వరకు మానవ హక్కుల కమిషన్, హైకోర్టుకు నుంచి వివరణ ఇవ్వలేదన్నారు. రాజేశ్ మృతదేహానికి పోస్టుమార్టం చేసిన డాక్టర్, దానిని చిత్రీకరించిన వీడియోగ్రాఫర్‌పై అననుమానం ఉందన్నారు. జాతీయ ఎస్సీ కమిషన్‌ను కలిసి వివరించిన తర్వాత డిసెంబర్ 18న రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ, డీజీపికి నోటీసులు పంపించారన్నారు. కర్ల రాజేశ్‌ను అరెస్టు చేయకముందు ఆయన సంపూర్ణ ఆరోగ్యవంతుడని నివేదికలు వచ్చాయని, అలాంటి వ్యక్తి గుండెపోటుతో చనిపోయాడని నమ్మించి కేసును నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. బీబీనగర్ ఏయిమ్స్ వైద్యులు, నిపుణులైన ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో రిపోస్టుమార్టం చేయించాలని డిమాండ్ చేశారు.
మంత్రి ఉత్తమ్ రీపోస్టుమార్టాన్ని అడ్డుకుంటున్నారు
జాతీయ ఎస్సీ కమిషన్ పది రోజుల్లో నివేదిక పంపించమని అడిగితే, సంఘటన జరిగి 80 రోజులు, నోటీసులు పంపి 50 రోజులు గడిచిపోయినా ఇంత వరకు డీజీపీ, చీఫ్ సెక్రటరీ ఎందుకు స్పందించడం లేదని, రిపోస్టుమార్గానికి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఒక జాతీయ ఎస్సీ కమిషన్ సూచనలను పోలీసు శాఖ పట్టించుకోవడం లేదన్నారు. రీపోస్టుమార్టంకు ప్రత్యక్షంగా అడ్డుపడుతున్నది సూర్యపేట జిల్లా ఎస్సీ నర్సింహా అయితే, ఆయనపై ఒత్తిడి తీసుకువస్తున్నది మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిలని ఆరోపించారు.
ఒక అగ్రవర్ణ మహిళ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంటే సీసీ ఫుటేజీలు వస్తున్నాయని, పోలీసులు ప్రతి కేసును సీసీ ఫుటేజీ ఆదారంగానే దర్యాప్తు చేస్తున్నారని, కాని ఒక దళిత వర్గానికి చెందిన రాజేశ్ మృతిపై మాత్రం సీసీ ఫుటేజీలు దొరకడం లేదా అని ప్రశ్నించారు. ప్రస్తుత ఎస్పీ సాక్షాలను మాయం చేసే ప్రయత్నం చేస్తున్నారని, సీసీ ఫుటేజీలను దాచి పెట్టే చర్యలు చేస్తున్నారని ఆరోపించారు.
మరియమ్మ కేసులో నాటి సీఎం కేసీఆర్ న్యాయం చేశారు
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మరియమ్మ లాకప్‌డెత్ విషయంలో నాటి సీఎం కేసీఆర్ స్పందించిన తీరును అభినందించాల్సిందేనన్నారు. అక్కడ పోలీసుల తప్పిదమని తేలిపోయిన వెంటనే దళితులపై చేయి పడితే ఊరుకోమని కేసీఆర్ బహిరంగ ప్రకటన చేశారని, పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు. పది రోజుల వ్యవధిలో మరియమ్మ కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం, ఇళ్లు, రూ.15లక్షలు పరిహారం, ఇద్దరు కుమార్తెలకు రూ.10లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించి బాధిత కుటుంబానికి సంపూర్ణ న్యాయం చేశారని ప్రశంసించారు. బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకున్నారని, సస్పెండ్, డిస్మిస్లు చేశారని, గుర్తు చేశారు.
రేవంత్ రెడ్డి నిద్ర పోతున్నాడా….లేక నటిస్తున్నాడా
ఒక దళితుడు చనిపోయి 80 రోజులు గడిచినా ముఖ్యమంత్రి, హోం మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి స్పందించకపోవడం అత్యంత శోచనీయమన్నారు. ఓ వైపు పోలీసు శాఖ నీరు గార్చే ప్రయత్నం చేస్తుండగా, మరో వైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మిన్నకుండడం వెనుక అంతర్యమేమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇంతా జరుగుతున్నా సీఎం నిద్రపోతున్నాడా, లేని నిద్రపోతున్నట్లు నడిస్తున్నాడా అనే అనుమానం కలుగుతుందన్నారు. రాజేశ్ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు విశ్రమించేది లేదని, త్వరలోనే జాతీయ ఎస్సీ కమిషన్‌ను మళ్లీ కలుస్తామని, పోలీసుల చర్యలను ఆదారాలతో బయటపెడుతామన్నారు. రిపోస్టుమార్టం చేసి నిజ నిజాలు బయటకు వచ్చే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.