సిటీబ్యూరో, మార్చి 29 (నమస్తే తెలంగాణ): రోగ నిర్థారణ, చికిత్స, సేవలలో వైద్య అనుబంధ వృత్తుల ప్రాముఖ్యం రోజురోజుకూ పెరుగుతోందని, వైద్యరంగంలో సాంకేతికత అభివృద్ధి చెందడంతో ఈ విభాగానికి చెందిన నిపుణుల అవసరం కూడా పెరిగిందని తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు మంచాల రవీందర్ అన్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, వైద్య అనుబంధ వృత్తుల జాతీయ కమిషన్ సభ్యుడిగా ఎంపికైన నిమ్స్ వైద్య అనుబంధ వృత్తి విజ్ఞాన కళాశాల ప్రిన్సిపాల్ శిరందాస్ శ్రీనివాస్‌ను శనివారం రవీందర్ సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం వైద్య రంగంలో నాణ్యమైన సేవలు అందించడానికి సుశిక్షితులైన సాంకేతిక సిబ్బంది అవసరం ఏర్పడిందని, అందుకోసం ఈ వృత్తులకు సంబంధించిన సాంకేతిక నిపుణుల రిజిస్టేష్రన్ చేయడానికి రాష్ట్ర కౌన్సిల్ అవసరమన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే రాష్ట్రస్థాయి కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వైద్య అనుబంధ వృత్తుల్లో శిక్షణ పొందిన, అర్హులైన సాంకేతిక సిబ్బంది విధిగా రాష్ట్ర స్థాయి కౌన్సిల్, జాతీయ స్థాయిలో రిజిస్టేష్రన్ చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ మహిళా అధ్యక్షురాలు నిర్మల, నిమ్స్ ఉద్యోగులు పాల్గొన్నారు.