ఖైరతాబాద్, ఫిబ్రవరి 7 : సొంత భూమిని విక్రయించేందుకు రియల్ వ్యాపారులను సంప్రదిస్తే ఏకంగా తప్పుడు పత్రాలు సృష్టించి.. తన భూమినే కాజేశారంటూ ఓ బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. న్యాయం కోసం మూడేండ్లుగా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నా.. ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మరోవైపు తాకట్టులో ఉన్న బంగారం విడిపిస్తానంటూ.. మరో వ్యక్తి మోసం చేయగా, పోలీసులను ఆశ్రయిస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా తాత్సారం చేస్తుండడంతో మూడు నెలలుగా ఆ పీఎస్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ విసిగిపోయి చివరకు మీడియాను ఆశ్రయించారు.
నల్లగొండ జిల్లా ఆర్టీసీ కాలనీకి చెందిన లక్ష్మీమల్ల బేబిరాణి తనకు జరిగిన అన్యాయాన్ని ‘నమస్తే’కు వివరించారు. ప్రస్తుతం బేబిరాణి యూసుఫ్‌గూడ రాజీవ్‌నగర్‌లో కొడుకు నవీన్ కుమార్‌తో కలిసి నివాసముంటూ బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానలో నర్సుగా పనిచేస్తున్నారు. భర్త చిన్న రాములు కొంత కాలం కిందట మరణించారు. కొడుకు విదేశాల్లో ఉన్నత చదువుల కోసం డబ్బులు అవసరం ఉండడంతో భర్త ద్వారా సంక్రమించిన నల్లగొండ జిల్లా పెద్ద అడిసెర్లపల్లి మండలం, అజ్మాపుర గ్రామంలోని సర్వే నం. 72/ఈలో ఉన్న 2 ఎకరాల 18 గుంటల వ్యవసాయ భూమిని విక్రయించేందుకు నిర్ణయించారు.
అందుకోసం బేబిరాణి 2022లో స్థానికంగా ఉండే నాగు అనే మధ్యవర్తి ద్వారా హైదరాబాద్‌లోని బీఎన్‌రెడ్డిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న కర్మాన్‌ఘాట్‌కు చెందిన హనుమా నాయక్, భాస్కర్, జిల్లాలెగూడకు చెందిన కోటయ్య నాయక్‌లను సంప్రదించారు. మొత్తం భూమిని రూ. 40,91,500కు విక్రయించేందుకు అగ్రిమెంట్ జరిగింది. తొలుత రూ.5 లక్షలు ఇచ్చి మిగతా డబ్బులు రెండు రోజుల్లో చెల్లిస్తామని చెప్పి.. నెల రోజుల తర్వాత రూ.6.50 లక్షల చెక్కులు ఇచ్చారు. రోజులు గడుస్తున్నా..మిగిలిన డబ్బులు ఇవ్వకుండా ఆమెను వారి కార్యాలయం చుట్టూ తిప్పించుకున్నారు.
అయితే ఆ అగ్రిమెంట్ కాలపరిమితి ముగియడంతో అదే భూమిని 2023 జూన్‌లో మరో వ్యక్తికి విక్రయించే ప్రయత్నం చేయగా, సదరు రియల్ ఎస్టేట్ వ్యాపారుల్లో ఒకరు తానే షూరిటీగా ఉంటానని నమ్మబలికాడు. తీరా విక్రయించే సమయంలో విషయాన్ని మిగతా భాగస్వాములకు చెప్పడంతో వారు ముందుగానే అక్కడికి చేరుకొని సదరు భూమిని తమ ఆధీనంలోకి తీసుకున్నారని, అదే తరుణంలో తన కొడుకు తమ భూమి వద్దకు వెళ్లగా, అక్కడ రౌడీలతో దాడి చేయించి తీవ్రంగా కొట్టించారని బేబిరాణి వాపోయారు. అదే సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఫోర్జరీ పత్రాలతో తమ భూమిని ఆక్రమించుకున్నారని, తమ కుటుంబసభ్యుల సంతకాలేవీ లేకుండా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆమె ఆరోపించారు.
దాడులు….ఫిర్యాదులు…
స్థలం కబ్జా చేసినా కనీసం తమ డబ్బులు చెల్లించాలంటూ సదరు రియల్ వ్యాపారులను 2023 డిసెంబర్లో బీఎన్‌రెడ్డిలోని వారి కార్యాలయానికి వెళ్లి నిలదీయగా, దాడి చేసి తీవ్రంగా కొట్టారని బేబిరాణి వాపోయారు. తిరిగి 2024 జనవరి, డిసెంబర్ నెలలో నిలదీసేందుకు వెళ్లినప్పుడు అలాగే దాడి చేశారని, తనపై దాడి చేసిన ప్రతి సారి వనస్థలిపురం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశానని, బాధ్యులపై దాడి, చీటింగ్ కేసులు నమోదు చేసినా.. వారిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని బేబిరాణి ఆరోపించారు.
సదరు వ్యాపారులు నివాసముండే ఎల్బీనగర్, మీర్పేటతో పాటు ప్రస్తుతం తాను ఉంటున్న ప్రాంతంలోని బోరబండ పోలీసు స్టేషన్లో సైతం ఫిర్యాదు చేయగా, ఎలాంటి చర్యలు లేవని కన్నీటి పర్యంతమయ్యారు. వారితో తనకు ప్రాణహాని ఉందని భయాందోళన వ్యక్తం చేశారు. గడిచిన మూడే ండ్లుగా ఆయా పోలీసు స్టేషన్ల చుట్టూ ప్రదక్షిణలు చేసినా.. తనకు ఫలితం లేదని, ప్రభు త్వం, పోలీసు ఉన్నతాధికారులు స్పంది ంచి తనకు న్యాయం చేయాలని ఆమె కోరారు.
బంగారం విడిపిస్తానంటూ….
ఇదిలా ఉండగా, డబ్బులు అవసరం ఉండి బంగారం తాకట్టు పెట్టగా, దానిని విడిపిస్తానంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారుల్లో ఒకరు మరోసారి తనను మోసం చేశాడని, తన నగలు తీసుకొని తాను తాకట్టు పెట్టుకున్నాడని బాధితురాలు బేబిరాణి తెలిపారు. ఈ ఘటన పంజాగుట్ట పీఎస్ పరిధిలో జరుగడంతో తాను సదరు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయగా, ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని పేర్కొన్నారు. ఈ విషయంపై ఇన్స్పెక్టర్ రామకృష్ణను వివరణ కోరగా, బేబిరాణి తాకట్టు పెట్టిన నగలు విడిపించుకొని డబ్బులు తీసుకున్నారని వివరించారు.