సిటీబ్యూరో, జనవరి 9(నమస్తే తెలంగాణ): మధ్యాహ్న భోజన పథకాని (మిడ్ డే మీల్స్)కి సంబంధించిన కాంట్రాక్టును ఇప్పిస్తానంటూ నమ్మించి.. ఫోర్జరీ జీవోలు తయారు చేసి.. రూ.4కోట్లు మోసం చేసిన వ్యక్తిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. జగిత్యాలకు చెందిన ఓ సోషల్ మీడియా యాక్టివిస్టు అరవింద్ అలిశెట్టి మిడ్ డే మీల్స్ పథకానికి సంబంధించిన కాంట్రాక్టు ఇప్పిస్తానంటూ ఓ వ్యాపారిని నమ్మించాడు. కాంట్రాక్ట్ ఇచ్చినట్టు ప్రభుత్వం నుంచి జీవో కూడా తెస్తానంటూ చెప్పాడు. పాత జీవో కాపీలను తీసి వాటిని ఫోర్జరీ చేశాడు. ఆ ఫోర్జరీ జీవో కాపీల్లో ధనుష్‌కు కాంట్రాక్టు ఇప్పిస్తున్నట్లు తయారు చేశాడు. అతడి మాటలు నమ్మిన ధనుష్ రూ. 4 కోట్లు ఇచ్చాడు. బాధితుడికి బెంగళూర్‌లో కూడా వ్యాపారాలు ఉన్నాయి.
మిడ్ డే మీల్స్‌కు సంబంధించిన కాంట్రాక్టు జీవోలేవీ రాలేదన్న విషయం ఆ తర్వాత వ్యాపారికి తెలిసింది. ఈ నేపథ్యంలో బాధితుడు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విద్యాశాఖ అధికారుల వివరణ కోరారు. అది నకిలీ జీవో అని.. అలాంటి జీవోలు ప్రభుత్వం విడుదల చేయలేదంటూ విద్యాశాఖ అధికారులు తేల్చి చెప్పారు. దీంతో కేసు నమోదు చేసిన సీసీఎస్ పోలీసులు మంగళవారం అరవింద్‌ను అరెస్ట్ చేశారు. ఈ కేసు దర్యాప్తును నగర జాయింట్ సీపీ (క్రైమ్స్) రంగనాథ్ పర్యవేక్షణలో సీసీఎస్ బృందం చేపట్టింది.