ఖైరతాబాద్, ఫిబ్రవరి 15: నగరంలోని పంజాగుట్టలో నిర్లక్షపు డ్రైవింగ్‌కు ఓ వ్యక్తి (Road Accident) బలయ్యాడు. బహదూర్‌పురాకు చెందిన ఎండీ నజీర్ (50) ఆల్వాల్ నుంచి జూబ్లీహిల్స్ వైపునకు వెళ్తున్నారు. ఈ క్రమంలో పంజాగుట్ట ఫ్లైఓవర్ వద్ద వేగంగా దూసుకెచ్చిన కారు అతడిని వెనుక నుంచి డీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన నజీర్ అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కారు డ్రైవర్ అబ్దుల్ ఆరీఫ్ (45)ను అదుపులోకి తీసుకొని కార్ ను సీజ్ చేశారు. నిందితుడు ఆరిఫ్ జూబ్లీహిల్స్‌లో ప్రైవేట్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద బీఎండబ్ల్యూ కారు బీభత్సం
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద బీఎండబ్ల్యూ కారు (BMW Car) బీభత్సం సృష్టించింది. శనివారం తెల్లవారుజామున అతివేగంగా దూసుకొచ్చిన కారు జూబ్లీ చెక్‌పోస్టు వద్ద ట్రాఫిక్ పోలీస్ బూత్ దిమ్మెల్ని ఢీకొట్టింది. అయితే కారులోని ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో ప్రాణనష్టం తప్పింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే లోపే.. కారులోని వ్యక్తులు అక్కడి నుంచి పరారయ్యారు. ప్రమాద సమయంలో డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
కారు నంబర్ ప్లేట్ (TS09FY9990) ఆధారంగా యజమానిని గుర్తించేందుకు యత్నిస్తున్నారు. మాలిక్ జెమ్స్ అండ్ జ్యవెలరీ పేరుతో కారు రిజిస్ట్రేషన్ అయినట్లు తేల్చారు. ఇప్పటికే కారుపై రెండు పెండింగ్ చలాన్లు ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కారులో ఎంతమంది ఉన్నారనే విషయమై సీసీటీవీ వీడియోలను పరిశీలిస్తున్నారు.