సిటీబ్యూరో, ఆగస్టు 24(నమస్తేతెలంగాణ) / వికారాబాద్:“ఈ ఏడాది అందరూ సంక్రాంతి పండుగ చేసుకుంటున్నారు. మీర్పేట్లో మాత్రం మాధవి అనే వివాహిత అత్యంత దారుణంగా హత్యకు గురైంది. గురుమూర్తి అనే రిటైర్డు ఆర్మీ ఉద్యోగి ఆమెను చంపి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి ఉడకబెట్టాడు.. ఆమె శరీర భాగాల అనవాళ్లు లేకుండా కొన్ని చెరువులో పడేశాడు.
మరికొన్ని భాగాలను ఉడికించి మెత్తగా చేసి బాత్రూంలో పారపోశాడు.. ఆ తరువాత ఆమె కన్పించడం లేదంటూ భార్య కుటుంబ సభ్యులతో కలిసి మీర్పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని వ్యవహారంపై అనుమానం వచ్చిన మాధవి కుటుంబ సభ్యులు పోలీసుల వద్ద పలు సందేహాలు వ్యక్తంచేశారు.. దీంతో భర్తే ఏదో చేశాడనే అనుమానంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. సాంకేతిక పరిజ్ఞానంతో మాధవిని హత్య చేసిన ఆ ఇంట్లో రక్తపునమునాలను సేకరించి, మాధవిని హతమార్చినట్లు ఆధారాలు సేకరించిన పోలీసులు గురుమూర్తిని అరెస్ట్ చేశారు”
“ ఇటీవల డిల్లీలో ఫాతిమా(30) అనే మహిళను ఆమె భర్త షహబాబ్ అలీ కిరాతంగా హత్య చేశాడు. ఆమె మృతదేహం లభించకుండా ఉండేలా మృతదేహాన్ని శ్మశాన వాటికలో తన స్నేహితుల సహకారంతో పాతి పెట్టాడు. ఆమె ఎవరితోనో లోచిపోయిందని కట్టుకథ అల్లి తప్పించుకునేందుకు ప్రయత్నించగా సీసీ కెమెరాల ద్వారా భర్తే హంతకుడనే విషయాన్ని పోలీసులు ధ్రువపరిచారు. ఫాతిమాను హత్య చేసేందుకు గత కొన్ని రోజులుగానే అతను ఎత్తులు వేశాడు.ఇందులో భాగంగా ఆమెకు మత్తుతో కూడిన మందులు ఇస్తూ ఆమెను నిస్సహాయ స్థితికి తెచ్చి హతమార్చాడు” నిందితుడు.
చట్టానికి దొరకకుండా ..
భార్యను చంపిన అనవాళ్లు లేకుండా చేయాలని ఈ రెండు ఘటనలలో నేరస్తులైన భర్తలు ప్రయత్నించారు…. అలాంటిదే తాజాగా మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. గతంలో జరిగిన ఘటనలు.. సోషల్‌మీడియా.. హర్రర్ మూవీస్.. క్రైమ్ సీరిస్‌లతో పాటు పరోక్షంగా కుటుంబ సభ్యుల సహకారంతో కొందరు మృగాలుగా మారుతున్నారు. కట్టుకున్న భార్యలను కిరాతంగా హతమారుస్తున్నారు. చట్టానికి దొరకకుండా ఉండేలా.. శరీరాన్ని ముక్కలుగా చేసి అనవాళ్లు దొరకకుండా చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.
తాజాగా మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడ గ్రామానికి చెందిన సామల మహేందర్‌రెడ్డి(27), స్వాతి(21) అలియాస్ జ్యోతిలు ప్రేమించి పెండ్లి చేసుకున్నారు. పెండ్లి చేసుకున్నప్పటి నుంచే ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. స్వాతి కుటుంబానికి పెళ్లి ఇష్టం లేకున్నా, మహేందర్‌రెడ్డి కుటుంబమే ఈ ఇద్దరికి కులంతర వివాహం చేయడంలో కీలకంగా వ్యవహారించినట్లు చర్చించుకుంటున్నారు. ప్రేమించిన అమ్మాయితో జీవితాంతం సుఖ సంతోషాలతో ఉండాల్సిన వారు, పెండ్లి చేసుకోగానే ఇరువురి మధ్య గొడవలు మొదలయ్యాయి.
ఆ గొడవలు చినికి చినికి గాలివానలా మారుతూ పోలీస్‌స్టేషన్‌లో కేసుల వరకు కూడా వెళ్లాయి. ప్రేమించి పెండ్లి చేసుకున్న ఇద్దరూ గొడవ పడుతుండడంతో పెద్దలు అందరు మహేందర్, స్వాతిలను సముదాయించారు, ఇరు కుటుంబాలను కూడా సముదాయించి కేసు రాజీ కుదుర్చారు. డిగ్రీ చదివిన స్వాతి పంజాగుట్టలో కాల్ సెంటర్లో పనిచేస్తుండగా వృత్తిరీత్యా ఆమె ఫోన్లో మాట్లాటాల్సిన పరిస్థితి ఉండేది. దానిని కూడా మహేందర్ జీర్ణించుకోలేకపోయాడు, అక్కడ కూడా అనుమాన పడుతూ ఆమెతో గొడవలు పెట్టుకునేవాడు.
క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తూ మహేందర్ కుటుంబానికి స్వాతి ఉద్యోగం చేయడంతో సహాయంగా ఉంటుందనుకున్నారు, కాని అనుమానంతో ఆమెను ఉద్యోగం నుంచి కూడా మానిపించేశాడు. గర్భవతి అయిన ఆమెను జాగ్రత్తగా చూసుకోవాల్సిన మహేందర్, అతని కుటుంబ సభ్యులు ఆ విషయానే మర్చిపోయారు. ఆమెనే స్వయంగా దవాఖానకు వెళ్లాలని భావించినా దానికి కూడా అడ్డుకట్ట వేస్తూ మహేందర్ గొడవకు దిగేవాడు. గొడవలు, కులాంతర వివాహం, అనుమానం అన్ని కలిశాయి. దీనికి తోడు కుటుంబ సభ్యులు కూడా అప్పుడప్పుడూ ఎత్తిపొడుస్తూ మాట్లాడేవారని స్థానికంగా మాట్లాడుకుంటున్నారు.
హత్య చేసి దొరకకుండా ప్లాన్!
హత్య చేసి మృతదేహం దొరకుండా చేస్తే చట్టానికి దొరకకుండా ఉండొచ్చని మహేందర్ భావించినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే గర్భవతి అయిన భార్యను చంపేందుకు ప్రణాళిక రచించాడు. యాక్సా బ్లేడ్లు కొని ఇంటికి వెళ్లాడు. ఎలాగైనే స్వాతిని వదిలించుకోవాలని అనుకొని శనివారం తన ప్లాన్‌ను అమలు చేశాడు. హత్య చేసి ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసేశాడు. గర్భంతో ఉన్న ఆమె మొండెం మాత్రం ఇంట్లోనే ఉండిపోయింది. ఇంట్లో నుంచి మూసీ వరకు మూడు సార్లు వెళ్లి తల, కాళ్లు, చేతులు పడేసి వచ్చాడు. ఇంట్లో నుంచి బయటకు శరీర భాగాలను పడేసేందుకు వెళ్తున్న సీసీ కెమెరాల దృశ్యాలను పోలీసులు సేకరించారు.
పోలీసులు ఇంటికి రారనే..!
తన భార్య కనిపించడం లేదని సోదరికి ఫోన్ చేయడం, వాళ్లంతా హుటాహుటిన ఉప్పల్‌కు రావడం వెనుక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులకు తన భార్య కన్పించడం లేదని ఫిర్యాదు చేస్తే అక్కడక్కడా, ఊరికి వెళ్లి వెతుకుతారని భావించి ఉంటాడని, పోలీసులు ఫిర్యాదు ఇచ్చిన తరువాత ఇంటికి వచ్చి ఇంటిని పరిశీలిస్తారని మహేందర్‌రెడ్డి ఉహించలేదని పోలీసులు పేర్కొంటున్నారు. పోలీసులకు ఫిర్యాదు ఇచ్చి వెళ్లి, ఇంట్లో ఉన్న మొండాన్ని కూడా మాయం చేసేందుకు మహేందర్ స్కెచ్ వేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ విషయాలు దర్యాప్తులో వెల్లడవుతాయని పోలీసులు పేర్కొంటున్నారు. మొండానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం, డీఎన్ఏ పరీక్షలు కూడా పోలీసులు చేయనున్నారు.
భర్తల కిరాతక హత్యలు..
భార్యలను కిరాతంగా చంపుతున్న ఘటనలు సమాజంలో ఆందోళన కలిగిస్తున్నాయి. భార్యతో కలిసి ఉండడం ఇష్టం లేకుంటే చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలి కాని, హత్యలు చేసి, మృతదేహాలను మాయం చేసే పరిస్థితి వరకు ఎందుకు వస్తుందంటూ ప్రశ్నలు ఉత్నన్పమవుతున్నాయి. ఉన్మాదిలా మారుతూ భార్యలను కిరాతంగా చంపుతున్న ఘటనల వెనుక ఇంటర్నెట్ ప్రభావం కూడా ఉందని, అనుమానం కూడా పెనుభూతమవుతుందని పలువురు పేర్కొంటున్నారు.