మియాపూర్, ఏప్రిల్ 8: సమీప బంధువుల అమ్మాయిని ప్రేమించాడు. పెళ్లికి యువతి కుటుంబ సభ్యులు నిరాకరించటంతో మనస్థాపంతో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. మియాపూర్ ఎస్ఐ రాఘవేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా న్యాలకల్ మండలం మీర్జాపూర్ గ్రామానికి చెందిన మేకల సునీల్(22) పదవ తరగతి చదివాడు. కుటుంబ సభ్యులతో కలిసి మియాపూర్ ఎంఏ నగర్లో నివాసముంటూ స్విగ్గీలో డెలివరీ బాయ్‌గా కొంతకాలంగా పని చేస్తున్నాడు.
స్వగ్రామానికి చెందిన సమీప బంధువుల అమ్మాయిని కొంత కాలంగా ప్రేమిస్తున్నాడు. పెండ్లి చేసుకుంటానని అడగ్గా.. యువతి తల్లిదండ్రులు అందుకు అంగీకరించలేదు. దీంతో ప్రేమించిన యువతితో పెళ్లి కావటం లేదని తీవ్ర మనస్తాపానికి గురై శనివారం ఉదయం ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.