హైదరాబాద్: ప్రియుడిపై మోజుతో భర్తకు విడాకులిచ్చింది. పెండ్లి చేసుకుంటానని నమ్మించిన అతడు తన కామ వాంఛ తీర్చుకుని ఆ యువతిని గర్భవతిని చేశాడు. అనంతరం మొహం చాటేశాడు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్లకు చెందిన యువతి(24) హైదరాబాద్ (Hyderabad) మధురానగర్‌లోని ఓ హాస్టల్లో ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నది. ఐదేళ్ల క్రితమే ఆమెకు వివాహం అయింది. అయితే భర్తతో మనస్పర్థల కారణంగా విడిగా ఉంటున్నది.
ఈ క్రమంలో ఆ యువతిపై దూరపు బంధువు గోపి(24) కన్నేశాడు. ప్రేమ పేరుతో ఆమెకు దగ్గరయ్యాడు. ఆమెను పెండ్లి చేసుకుంటానని నమ్మించి భర్తకు విడాకులివ్వాలని ఒత్తిడి తీసుకువచ్చాడు. దీంతో ఆమె తన భర్తకు విడాకులు ఇచ్చింది. అనంతరం జేఎన్టీయూలోని తన రూమ్‌కు, మధురానగర్, కూకట్‌పల్లిలోని ఓయో లాడ్జీ రూమ్‌లకు తీసుకెళ్లి పలుమార్లు శారీరకంగా కలిశారు. దాంతో యువతి గర్భం దాల్చింది. కామ వాంఛ తీరడంతో పెండ్లి మాటను దాటవేస్తూ కాలం గడుపుతూ వస్తున్నాడు. అయితే తనని మోసం చేసి మరో యువతిని పెండ్లి చేసుకోబోతున్నాడని తెలుసుకున్న బాధితురాలు గోపి కుటుంబ సభ్యులతోపాటు పెండ్లి చేసుకోబోయే యువతి కుటుంబానికి కూడా కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించింది. అయితే గోపి సోదరుడు బాధితురాలిని తీవ్ర పదజాలంతో దూషించి బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో ప్రియుడిపై యువతి మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. జీరో ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేసి కేసును కేపీహెచ్‌బీ ఠాణాకు బదిలీ చేశారు.