కుత్బుల్లాపూర్, మే12: పాత కక్షలతో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. హత్యకు సంబంధించిన వివరాలను మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి సోమవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మేడ్చల్ ప్రాంతం ప్రభుత్వ బాలుర పాఠశాల సమీపానికి చెందిన సయ్యద్ సిద్ధిక్ (38) వారాంతపు సంతలో కూరగాయల వ్యాపారులకు బ్యాటరీ లైట్లు సరఫరా చేసే వ్యాపారం చేస్తున్నాడు. అదే వ్యాపారంలో నిమగ్నమైన మచ్చ బొల్లారం ప్రాంతానికి చెందిన షేక్ అహ్మద్ అలియాస్ నూర్ తో మార్చిలో మేడ్చల్ వారాంతపు సంతలో సిద్ధిక్ తో గొడవ జరిగింది. ఈ ఘర్షణలో షేక్ అహ్మద్ పై సిద్ధిక్ దాడి చేయగా మేడ్చల్ పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కేసు నమోదు చేశారు.
సిద్ధిక్ పలుమార్లు తనపై పెట్టిన కేసును వెనక్కి తీసుకోవాలని షేక్ అహ్మద్ తో పలుమార్లు రాయబారాలు జరిపాడు. తనపై కేసును ఉపసంహరించుకోకుంటే నిన్ను నీ కుటుంబాన్ని అంతం చేస్తానంటూ బెదిరింపులకు గురి చేశాడు. దీంతో షేక్ అహ్మద్ ఆందోళనకు గురై పక్కా ప్రణాళికతో సిద్ధిక్ ను చంపేయాలని పూనుకున్నాడు. తన సోదరుడు షేక్ రెహ్మత్, స్నేహితుడు కొడిమ్యాల శశి కుమార్, వాగ్మార్ రాజ్ కమల్, వరికుప్పల జంపన్నలతో కలిసి ఈనెల 11న రాత్రి 8.45 గంటల సమయంలో కొంపల్లిలోని సెంట్రల్ పార్క్ లో జరుగుతున్న సంతలో కత్తులతో దాడి చేసి పరారయ్యారు. నిందితులను పట్టుకొని పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ పురుషోత్తం, పేట్‌బషీరాబాద్ ఏసీపీ రాములు, ఎస్హెచ్ఓ విజయ్ వర్ధన్ తోపాటు డీఐలు ఎస్సైలు, ఎస్వోటీ పోలీసులు పాల్గొన్నారు.