దుండిగల్, మే 5 : తీసుకున్న అప్పులు వడ్డీతో సహా చెల్లించాలని ఒత్తిడి పెరిగిపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి అప్పు ఇచ్చిన వ్యక్తి ఇంటి ముందే ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న ఘటన సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గాజుల రామారం సర్కిల్, సూరారం డివిజన్ పరిధిలోని శివాలయ నగర్ కు చెందిన శ్రీనివాస్ (40) ఓ ఫార్మా కంపెనీలో బాయిలర్ ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు. ఆయన సతీమణి కూలీ పని చేస్తుండేది. ఈ క్రమంలో ఏడాది క్రితం దంపతులు, బస్తీలోనే ఉండే ఓ మహిళ వద్ద తమ అవసర నిమిత్తం రూ.9 లక్షలు అప్పుగా తీసుకున్నారు. ఇందుకుగాను ప్రతినెలా రూ.36 వేలు మిత్తి కింద చెల్లిస్తున్నారు.
ఈ నేపథ్యంలో గత ఆరు నెలలుగా శ్రీనివాస్ దంపతులు వడ్డీ డబ్బులు చెల్లించడంలో విఫలమయ్యారు. దీంతో.. తమ డబ్బులు చెల్లించాలంటూ అప్పు ఇచ్చిన వాళ్లు.. దంపతులపై సోమవారం ఒత్తిడి చేశారు. దీంతో మనస్తాపానికి గురైన శ్రీనివాస్ సోమవారం ఉదయం ..తనకు అప్పు ఇచ్చిన వారి ఇంటి ముందుకు వెళ్లి ఒంటిపై నిప్పంటించుకున్నాడు. ఈ ఘటనలో శ్రీనివాస్‌కు 50 శాతం పైగా కాలిన గాయాలయ్యాయి. సూరారం పోలీసులు వెంటనే అతన్ని చికిత్స కోసం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం శ్రీనివాస్ విషమ పరిస్థితిలో చికిత్స పొందుతున్నట్టు పోలీసులు తెలిపారు.