బంజారాహిల్స్,మార్చి 12: ర్యాష్ డ్రైవింగ్ ఎందుకు చేస్తున్నావని ప్రశ్నించిన ఓ వ్యక్తిని చితకబాదిన ఇద్దరు యువకులపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఎల్లారెడ్డిగూడలో నివాసం ఉంటున్న షేక్ తబ్రేజ్(29) అనే యువకుడు ఈనెల 6న సాయంత్రం ఆఫీసు నుంచి ఇంటికి వెళ్తున్నాడు. జూబ్లీహిల్స్ రోడ్ నం.5లోకి రాగానే వెనుక నుంచి వచ్చిన బైక్ అకస్మాత్తుగా ర్యాష్ డ్రైవింగ్తో దూసుకువచ్చింది.
దీంతో స్లోగా వెళ్లవచ్చు కదా.. అంటూ తబ్రేజ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో బైక్ మీద నుంచి దిగిన ఆ ఇద్దరు యువకులు అతడిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. దీంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు తనపై దాడి చేశారని, వారి దాడిలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందానని బుధవారం బాధితుడు తబ్రేజ్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు బీఎన్ఎస్ 126(2), 115(2), 351(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.