సిటీబ్యూరో, మార్చి 2(నమస్తే తెలంగాణ): తులం బంగారంను రూ.30వేల కు ఇస్తానంటూ మోసానికి పాల్పడిన వ్యక్తిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. వివరాల ప్రకారం.. హైదరాబాద్ సరూర్‌నగర్ ప్రాంతానికి చెందిన జల్లే చంద్రశేఖర్‌రెడ్డి ఆన్లైన్బెట్టింగ్, మద్యానికి బానిసయ్యాడు. వాటిని ఎంజాయ్ చేసేందుకు డబ్బులు సరిపోకపోవడంతో తెలిసినవారికి వాట్సప్ కాల్ చేసి బంగారం తక్కువ ధరకు ఇస్తానంటూ నమ్మించాడు.
ఇలా తెలిసిన వారి ద్వారా కోఠి ప్రాంతానికి చెందిన ఓ 75 ఏళ్ల వృద్ధుడి నెంబర్ సేకరించాడు. అతనికి వాట్సప్ కాల్ చేసి తాను ముంబై వెళ్తున్నానని అక్కడ బంగారం తులం రూ.50వేలకే ఇస్తారని, ఇక్కడికంటే రూ.30వేలు తక్కువగా వస్తుందని చెప్పాడు. బంగారం రేటు పెరిగినప్పుడల్లా ఫోన్ చేసి బాధితుడికి తక్కువ ధరకు వస్తుందని చెప్పడంతో పాటు బాధితుడికి తెలిసిన కొందరి పేర్లు చెప్పి వారు కూడా తన వద్ద బంగారం కొంటున్నారంటూ నమ్మించాడు.
దీంతో అతను రూ.5లక్షల రూపాయలను చంద్రశేఖర్‌రెడ్డి ఖాతాలో వేశాడు. గత ఏడాది డిసెంబర్లో ఈ ఐదులక్షల రూపాయలు తీసుకుని బంగారం ఇవ్వడానికి వాయిదాలు పెట్టడంతో బాధితుడు అతనిని నిలదీశాడు. దీంతో మరికొన్ని డబ్బులు ఇస్తే బంగారం ఇస్తానని చెప్పడంతో బాధితుడు తాను మోసపోయానని గ్రహించి సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇన్స్పెక్టర్ కె.ప్రసాదరావు నేతృత్వంలో ఎస్ఐ పివిఎస్ అభిషేక్, పిసిలు శేఖర్, క్రాంతికుమార్రెడ్డిల బృందం నిందితుడిని పట్టుకున్నారు. గతంలో చంద్రశేఖర్‌రెడ్డి ఇటువంటి తరహా మోసాలకే పాల్పడ్డాడని, తనకు డబ్బులు పంపినవారు మళ్లీ బంగారం అడిగితే స్పందించడని పోలీసులు తెలిపారు. నిందితుడి వద్ద నుంచి ఒక మొబైల్, ఒక బ్యాంక్ అకౌంట్ పాస్ బుక్ స్వాధీనం చేసుకున్నారు.