బంజారాహిల్స్.ఏప్రిల్ 11 : జల్సాలకు అలవాటు పడి బైక్స్ చోరీకి పాల్పడిన యువకుడిని జూబ్లీహిల్స్ క్రైం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. జూబ్లీహిల్స్ డీఐ ఆకుల రమేష్ తెలిపిన వివరాల ప్రకారం..వనపర్తి జిల్లా పాన్‌గల్ మండలం చింతకుంట గ్రామానికి చెందిన కర్రోల్ల వినోద్‌కుమార్(22) బతుకుదెరువుకోసం ఎనిమిదేళ్ల క్రితం నగరానికి వచ్చాడు. మౌలాలి సమీపంలోని హెచ్‌బీ కాలనీలో నివాసం ఉంటున్న సోదరుడి వద్ద ఉంటున్న వినోద్‌కుమార్ మూడేళ్ల పాటు సూపర్మార్కెట్లో పనిచేశాడు. ఏడాది కాలంగా రాపిడో బైక్ నడిపిస్తూ జీవనం సాగిస్తున్నాడు.
కాగా గత కొన్నినెలలనుంచి జల్సాలకు అలవాటు పడిన వినోద్‌కుమార్ అడ్డదారిలో డబ్బులు సంపాదించాలనే లక్ష్యంతో బైక్‌లను చోరీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ రోడ్ నెం 71కు చెందిన రవీందర్ అనే షేర్ బ్రోకర్ ఇంటివద్ద పార్క్ చేసిన అపాచీ బైక్‌ను గత నెల 24న తస్కరించాడు.
బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన జూబ్లీహిల్స్ క్రైం పోలీసులు ఆదివారం రాత్రి నిందితుడిని అరెస్ట్ చేశారు. అతడిని విచారించగా రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలో అత్తాపూర్‌లో కూడా అపాచీ బైక్‌ను తస్కరించినట్లు తేలింది. ఈ మేరకు నిందితుడిని వద్దనుంచి రెండు అపాచీ బైక్‌లు స్వాదీనం చేసుకున్న పోలీసులు సోమవారం రిమాండ్‌కు తరలించారు.