ఇరుకుగా మారిన రహదారులు
ఇబ్బందులు పడుతున్న వాహనదారులు
వెంటనే రోడ్డు విస్తరణ చేయాలని స్థానికుల విజ్ఞప్తి
అబిడ్స్, ఏప్రిల్ 21 : పాత ముంబై హైవే అయిన మల్లెపల్లి ప్రధాన రహదారి విస్తరణ ఇంకెన్నాళ్లకు జరిగేనో అని స్థానికులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. పాత ముంబై ప్రధాన రహదారి మల్లెపల్లి రహదారి గుండా ప్రతి నిత్యం వేలాది వాహనాల రాక పోకలు సాగుతుంటాయి. దీంతో తరచూ ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమవుతున్నది. ట్రాఫిక్ సమస్య నుంచి వాహనదారులకు విముక్తి కల్పించేందుకు గతంలో జీహెచ్ఎంసీ అధికారులు ఈ రహదారి విస్తరణకు చర్యలు తీసుకున్నారు. అప్పట్లో మార్కింగ్ కూడా చేసినట్లు వ్యాపారులు తెలిపారు. అంతకు ముందు మెహిదీపట్నం నుంచి బోయిగూడ కమాన్ వరకు ఈ రహదారిని విస్తరించేందుకు అధికారులు చర్యలు తీసుకుని ప్రధాని రహదారి విస్తరణ పనులను చేపట్టారు.
అదే విధంగా మల్లెపల్లి చౌరస్తా నుంచి మొదలుకుని బోయిగూడ కమాన్ వరకు రహదారి విస్తరణ పనులు చేపట్టనున్నట్లు తెలుసుకున్న వ్యాపారులు సంతోషం వ్యక్తం చేయగా.. అధికారులు విస్తరణ పనులను పక్కన పడేశారని వ్యాపారులు ఆరోపిస్తున్నారు. పాత ముంబై ప్రధాన రహదారి కాగా, ఇప్పటికీ భారీ వాహనాలు ఈ రహదారి మీదుగానే వెళ్తుంటాయి. రోడ్డు ఇరుకుగా ఉండడంతో ఎదురెదురుగా రెండు వాహనాలు వచ్చినప్పుడు ట్రాఫిక్ సమస్య ఏర్పడుతున్నది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని అధికారులు వెంటనే రహదారి విస్తరణ పనులను చేపట్టాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు.
రోడ్డు వెడల్పు పరిశీలనలో ఉంది
మల్లెపల్లి రహదారి వెడల్పు పనులు పరిశీలనలో ఉన్నాయి. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఈ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాం. రోడ్డు వెడల్పు పనులను చేపట్టేందుకు గాను ఉన్న అడ్డంకులను తొలగించి రోడ్డు వెడల్పు పనులు ప్రారంభమయ్యేలా చొరవ తీసుకుంటాం.
-ఎన్కెషాఫ్ అలి, జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్