మేడ్చల్, జూన్ 3(నమస్తే తెలంగాణ): అర్హులకు డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయించకుండా తమ కార్యకర్తలకే ఇచ్చే విధంగా కాంగ్రెస్ నాయకులు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని మేడ్చల్ జిల్లావాసులు ఆరోపించారు. ఈ మేరకు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ప్రతాపసింగారంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్లను కాంగ్రెస్ కార్యకర్తలకు కేటాయించే విధంగా జిల్లాలోని కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని మాజీ మంత్రి మల్లారెడ్డి నివాసానికి మంగళవారం బాధితులు తరలివచ్చారు.
అర్హులైన తమకు కాకుండా కాంగ్రెస్ కార్యకర్తలకు డబుల్ ఇళ్లు అందించేందుకు జాబితాను సిద్ధం చేస్తున్నారని మల్లారెడ్డికి మెరపెట్టుకున్నారు. గతంలో డబుల్‌బెడ్‌రూమ్‌లను కేటాయించేలా తమ పేర్లతో జాబితా సిద్ధం కాగా ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు మరో జాబితాను తయారు చేయడంపై వారు మండిపడుతున్నారు.
అర్హులందరికి డబుల్ బెడ్రూమ్లు అందే వరకు పోరాటం చెస్తామని మాజీ మంత్రి మల్లారెడ్డి బాధితులకు హామీ ఇచ్చారు. తదనంతరం మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో అర్హులకు డబుల్‌బెడ్‌రూమ్‌లను కేటాయించాలని ఎమ్మెల్యే మల్లారెడ్డి.. జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీధర్‌బాబును కలిసి వినతిపత్రం ఇచ్చారు. మల్లారెడ్డితో పాటు ప్రతాపసింగారం మాజీ సర్పంచ్ శివశంకర్, నాయకులు సంజీవరెడ్డి ఉన్నారు.
ప్రతాపసింగారంలో 2వేల ఇళ్లు..
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతాపసింగారంలో 2వేల డబుల్‌బెడ్‌రూమ్‌లను నిర్మించారు. అయితే ఇందుకు సంబంధించి ప్రతాపసింగారం గ్రామానికి చెందిన 90 మంది లబ్ధిదారులకు డబుల్‌బెడ్‌రూమ్‌లను అందించేలా నిర్ణయించారు. అయితే తదనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అర్హులకు కాకుండా తమ కార్యకర్తలకు ఇళ్లు అందించేలా ప్రయత్నాలు చేస్తోందంటూ ఆరోపణలున్నాయి. ఈ అరాచాకాలను అడ్డుకోవాలని బాధితులు కోరుతున్నారు.