మేడ్చల్, ఏప్రిల్17(నమస్తే తెలంగాణ): రాష్ట్రమంతటా అతలాకుతలంగా ఉన్నదని, కరోనా ఉన్న సమయంలో కంటే కాంగ్రెస్ పాలన అధ్వానంగా ఉందని ఎమ్మెల్యే మల్లారెడ్డి విమర్శించారు. గురువారం జవహర్‌నగర్‌లో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ సన్నాహక సమావేశంలో మల్లారెడ్డి మాట్లాడుతూ కరోనా వచ్చిన సమయంలో నైనా ఇంత అధ్వానంగా లేదని, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో ప్రజలు అన్ని రకాలుగా బాధలు పడుతున్నారన్నారు.
మళ్లీ వచ్చేది బీఆర్ఎస్సే, మూడేండ్లు ఓపిక పట్టండి..మళ్లీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ కావడం ఖాయం’ అని అన్నారు. కాగా, జవహర్‌నగర్ కార్పొరేషన్ పరిధిలో మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ శ్రేణులు ఇంటింటికీ వెళ్లి బీఆర్ఎస్ రజతోత్సవ సభకు తరలి రావాలంటూ.. ఆహ్వాన పత్రికలను అందజేశారు. జవహర్‌నగర్‌లో గోడలపై కేసీఆర్ నాయకత్వం వర్థిల్లాలి, రజతోత్సవ సభ విజయవంతం కావాలి అంటూ ఎమ్మెల్యే మల్లారెడ్డి స్వయంగా వాల్ రైటింగ్ చేపట్టారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు మైనార్టీలు మద్దతు ప్రకటించారు.