సిటీబ్యూరో, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): ఒడిశా నుంచి హర్యానాకు హైదరాబాద్ మీదుగా గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ. కోటి 28లక్షల 58 వేల విలువైన 510 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ శుక్రవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
గంజాయి స్మగ్లింగ్ చేసే డీలర్ హర్యానాలోని హిస్సార్ ప్రాంతంలో ఉంటాడు. ఇతడికి ఒడిశాలోని కలిమెల ప్రాంతంలో గంజాయి విక్రేతలతో పరిచయం ఉండటంతో అక్కడకు వెళ్లి 510 కిలోల గంజాయి ఆర్డర్ ఇచ్చి తిరిగి హర్యానాకు చేరుకున్నాడు. హర్యానాలో తన స్నేహితుడైన ప్రవీణ్ కుమార్, బంధువైన మనోహర్‌ను కలిశాడు.
ఒడిశా నుంచి హిస్సార్‌కు గంజాయి రవాణా చేసి పెడితే భారీగా డబ్బులు ఇస్తానంటూ నమ్మించి, ఒక ట్రాలీని వారికి అప్పగించాడు. ఆ ట్రాలీలో ఎవరికి అనుమానం రాకుండా రహస్యంగా క్యాబిన్లు చేయించాడు. దీంతో మనోహర్, ప్రవీణ్‌కుమార్ ఒడిశాకు వెళ్లి అక్కడ గంజాయి తీసుకొని తమ వాహనంలో సీక్రెట్ ప్లేస్‌లో దాచిపెట్టి బయలుదేరారు. మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోకి రాగానే మల్కాజిగిరి ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ రాములు బృందం, మేడిపల్లి పోలీసులతో కలిసి వాహనాన్ని పట్టుకున్నారు. అందులో ఉన్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సమావేశంలో ఓఎస్ఓటీ డీసీపీ గిరిధర్ తదితర అధికారులు పాల్గొన్నారు.