Hyderabad | వెంగళరావునగర్, జూన్ 26 : మున్నాళ్ల ముచ్చటగానే మారిపోయింది ఆ కొత్త మురిపెం. మోజు తీరాక మూడు ముళ్లు వేయనంటూ మొండికేశాడు ఆ ప్రియుడు. ప్రియుడి చేతిలో మోసపోయిన మేకప్ ఆర్టిస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సనత్ నగర్ పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి మధురానగర్ పోలీసుస్టేషన్‌కు బదిలీ చేశారు. పోలీసుల కథనం ప్రకారం రహ్మత్ నగర్లో నివాసముండే యువతి (29)కి ఐదేళ్ల క్రితం వివాహమైంది. భర్తతో విభేదాలు వచ్చి ఆరు నెలల తర్వాత విడాకులిచ్చింది. ఏడాది క్రితం షూటింగ్ ప్లేస్‌లో ఆమెను సాయిరామ్ (29) పరిచయం చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెకు దగ్గరయ్యాడు. యువతితో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. రహ్మత్ నగర్‌లోని ఓ అద్దెగదిలో యువతితో సహజీవనం చేశాడు. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసేసరికి చేసుకునేదే లేదని తెగేసి చెప్పాడు. పెద్దల సమక్షంలో పంచాయితీలు జరిగినా అతను పెళ్లికి అంగీకరించలేదు. దాంతో మోసపోయానని గ్రహించిన బాధిత యువతి సనత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. జీరో ఎఫ్ఐఆర్ను నమోదు చేసిన పోలీసులు కేసును మధురానగర్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. మధురానగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.