సిటీబ్యూరో, జూన్ 4(నమస్తే తెలంగాణ): మూడునెలల ఎన్నికల పర్వానికి తెర పడింది. ఎన్నికల ప్రక్రియ చివరిదైనా కౌంటింగ్ దశ ఉత్కంఠతో ముగిసింది. దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలను తెలుసుకునేందుకు జనాలు ఉదయం నుంచే ఆసక్తిగా తిలకించారు. రాజకీయ పార్టీల కార్యాలయాలు, పార్టీల నేతలు బిగ్ స్క్రీనింగ్‌తో సందడి వాతావరణం నెలకొనగా.. సిటీ జనాలు కౌంటింగ్ సరళిని గమనిస్తూ ఉండటంతో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారిపోయింది. పోటాపోటీగా కామెంట్లు, రీట్వీట్లు, రీల్స్‌తో మోతమోగిపోయింది. నెటిజన్లు ఉదయం నుంచే చురుగ్గా వ్యవహరించడంతో రిజల్ట్ డే రోజున electionresultupdate, LoksabhaPollResults యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వచ్చాయి.
ఇక పొరుగు రాష్ట్రం ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అత్యంత ఉత్కంఠకు తెరలేపాయి. ఉదయం నుంచే వైసీపీ, టీడీపీ, పవన్ మద్దతుదారులు కౌంటింగ్ సరళిని సోషల్ మీడియాలో పంచుకోవడంతో మరింత చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో అబ్ కీ బాద్ మోదీ సర్కార్ అంటూ బీజేపీ సేనలు ఫలితాలను చూసి కొంత నిరుత్సాహానికి గురికాగా, కాంగ్రెస్ మద్దతుదారులు కూడా ఫలితాలను తెలుసుకునేందుకు ఎక్కువగా ఎక్స్, ఇన్‌స్టాతోపాటు, ఉదయం నుంచే యూట్యూబ్‌లో వచ్చే లైవ్ టెలికాస్ట్లకు అతుక్కుపోయారు. దీంతో నగరంలో ఉదయం నుంచి మధ్యాహ్నం నాలుగు గంటల వరకు నిర్మానుష్యంగా మారింది. ముఖ్యంగా ఆఫీసులకు వెళ్లేవారితో నిత్యం రద్దీగా ఉండే ప్రధాన కూడళ్లు కూడా ఇవాళ తక్కువ ట్రాఫిక్ రద్దీతో వాహనాలు ముందుకు సాగాయి. ఇక ఎన్నికల కోడ్, 144 సెక్షన్ అమలులో ఉండటంతో ఫలితాలు వెలువడినా నగరంలో పెద్దగా సంబురాలు చేసుకోలేదు. పార్టీ కార్యాలయాలకే సంబురాలు పరిమితమయ్యాయి. ఇక మెజార్టీ జనాలు తమ అభిప్రాయాలను పంచుకునేందుకు సోషల్ మీడియాను ఆశ్రయించారు.