చర్లపల్లి, కాప్రా,మల్లాపూర్, ఫిబ్రవరి 4 : చర్లపల్లి పారిశ్రామికవాడలోని ఓ కెమికల్ కంపెనీలో మంగళవారం సా యంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పారిశ్రామికవాడలోని సర్వోదయ కెమికల్ కంపెనీలో నుంచి మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడటంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. హెచ్‌సీఎల్ సమీపంలోని ఈ కంపెనీలో చెలరేగిన మంటలు సమీపంలోని పలు కంపెనీలకు వ్యాపించాయి. మంటలు భారీగా ఎగిసిపడుతుండటంతో స్థానికులు భ యాందోళన చెందారు. చర్లపల్లి, కుషాయిగూడ పోలీసులు, ఫైర్ ఇంజన్లు వచ్చి మంటలను అదుపులోకి తెచ్చాయి.
పారిశ్రామికవాడలోని సర్వోదయ కెమికల్ కంపెనీలో మంగళవారం ఉదయం నుంచి పనిచేసిన 22 మంది కార్మికులు సాయంత్రం 5.30గంటలకు వెళ్లిపోయారు. సాయం త్రం 6.40 గంటలకు పరిశ్రమలోని సాల్వెంట్ల గదిలో మంటలు ప్రారంభమై క్రమ, క్రమంగా చెలరేగాయి. కెమికల్ పరిశ్రమకావడంతో పెద్ద ఎత్తున పేలుళ్లు, దట్టమైన పొగలు వ్యాపించాయి. సమీపంలోని ఫ్లోర షీల్డ్, మహాలక్ష్మి రబ్బర్ కంపెనీ, హరిత ఇండస్ట్రీస్ కంపెనీలకు మంటలు వ్యాపించా యి. కంపెనీ పూర్తిగా కాలిపోయింది.
సమాచారం అందుకున్న మేడ్చల్ జిల్లా ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్, చర్లపల్లి ఫైర్ అధికారి రంజిత్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని 8 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. మంటలు చెలరేగిన సమయంలో కెమికల్ పరిశ్రమలో కార్మికులు లేకపోవడంతో ఎ లాంటి ప్రాణ నష్టం జరగలేదు. కుషాయిగూడ ఏసీపీ మహేశ్మార్గౌడ్, చర్లపల్లి సీఐ రవికుమార్ తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కృషి చేశారు. సమీప ప్రాంతంలోని కంపెనీలకు మంటలు వ్యాపించడంతో ఆస్థి, ఇతరత్రా నష్టాల వివరాలు తెలియాల్సి ఉంది. రాచకొండ కమిషనర్ సుధీర్‌బాబు, ఐలా చైర్మన్ రోషిరెడ్డి, ఇతర ప్రతినిధులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.
సకాలంలో స్పందించిన జలమండలి…
మంగళవారం సాయంత్రం చర్లపల్లిలోని ఎన్ఎఫ్సీ ఫేజ్-1లో అగ్నిప్రమాదం సంభవించిందని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్‌కి వచ్చిన సమాచారాన్ని జలమండలి ప్రధాన కార్యాలయానికి చేరవేసి, వాటర్ ట్యాంకర్లకోసం సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించి జలమండలి జీఎంను అప్రమత్తం చేయడంతో మూడు ట్యాంకర్లతో నీటిని సరఫరా చేశారు. ఘటనా స్థలంలో ఇద్దరు మేనేజర్లు, పోలీస్, ఫైర్ అధికారుల సమన్వయంతో మంటలను ఆర్పారు.