మణికొండ: ఓ అపార్ట్మెంట్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని పుప్పాలగూడ గోల్డెన్ ఓరియల్ అపార్ట్మెంట్లోని బీ బ్లాక్ 310 ఫ్లాట్‌లో శనివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఇంట్లోని ఫ్రిడ్జ్ పేలడంతో ఆ మంటలన్నీ వంటగదిలోని సిలిండర్‌కు అంటుకుని మంటలు చెలరేగాయి. దీంతో ఇంట్లోని వారంతా ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బయటకు పరుగులు తీశారు.
దాదాపు రూ. 50 లక్షల వరకు ఆస్తినష్టం వాటిల్లినట్లు యజమాని వెంకట్ తెలిపారు. కాగా, అపార్ట్మెంట్లో ఎగిసిపడుతున్న మంటలను ఆర్పివేసేందుకు నాలుగు ఫైరింజన్లు వచ్చినా.. అవి వెళ్లేందుకు సరిగ్గా దారి లేకపోవడంతో గంట పాటు నిరీక్షణ తప్పలేదు. ఈ క్రమంలో వస్తువులన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. వాహనాలు తిరిగే ప్రాంతంలో గార్డెన్ ఏర్పాటు చేసుకొని.. మొక్కలు నాటడంతో ఫైరింజన్లు రావడానికి అన్నీ అడ్డంకులే కనిపించాయి. అదృష్టవశాత్తు ప్రాణనష్టం జరగలేదు.