సిటీబ్యూరో, జూన్ 16(నమస్తే తెలంగాణ): వర్షాకాలంలో డిస్కం పరిధిలో విద్యుత్ అంతరాయాలు తగ్గించేందుకు ఫీడర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు, ఎల్టీ/హెచ్‌టీ నెట్‌వర్క్‌ల నిర్వహణ పనులను వేగవంతం చేయాలని, చెట్ల కొమ్మల కత్తిరింపును వెంటనే పూర్తి చేయాలని టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేశ్ వీ పాటిల్ అధికారులను ఆదేశించారు. ‘పోల్స్ అండ్ లైన్స్ స్పెషల్ డ్రైవ్-వాక్ అలాంగ్ ది లైన్’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం జితేశ్ వీ పాటిల్ ఖైరతాబాద్ సర్కిల్లోని ఆనంద్‌నగర్ కాలనీలో క్షేత్రస్థాయి తనిఖీలు చేపట్టారు. విద్యుత్ పంపిణీ నెట్‌వర్క్‌ను లైన్ టు లైన్ సర్వే ద్వారా పరిశీలించి విద్యుత్ లైన్లు, విద్యుత్ స్తంభాలు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు, జంపర్లు, సర్వీస్ కనెక్షన్లు, ఇతర మౌలిక సదుపాయాల పరిస్థితిని పరిశీలించారు.
తనిఖీల్లో భాగంగా గుర్తించిన నెట్వర్క్ లోపాలు, పెండింగ్ రెక్టిఫికేషన్ పనులు, లైన్ క్లియరెన్స్ పనులు, దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలు, విద్యుత్ సరఫరా నాణ్యతపై ప్రభావం చూపే అంశాలను వెంటనే పరిష్కరించాలని అధికారులను సీఎండీ ఆదేశించారు. విద్యుత సిబ్బంది ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి వినియోగదారుల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని సూచించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు లేకుండా ఉండేలా ప్రతీ అధికారి తమ పరిధిలో నెట్‌వర్క్‌ను నిరంతరం పర్యవేక్షిస్తూ సమస్యలు తలెత్తకముందే నివారణ చర్యలు చేపట్టాలని సీఎండీ సూచించారు. ఈ కార్యక్రమంలో సైఫాబాద్ డీఈ సమ్మయ్య, ఏడీఈలు దుర్గాశ్రీనివాస్, వినోద్‌కుమార్, ఏఈ నరసింహతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.