బడంగ్ పేట్, జూన్ 28: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యా వ్యవస్థను గాలికి వదిలేశారని మహేశ్వర ఎమ్మెల్యే సబితారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలు మౌలిక సదుపాయాలకు నోచుకోవడం లేదని, విద్యార్థులకు మంచినీళ్లు అందించలేని దుర్భర పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందన్నారు. నియోజకవర్గంలోని బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ 14వ డివిజన్లోని మల్లాపూర్ ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడీ కేంద్రాన్ని ఎమ్మెల్యే సబితారెడ్డి శనివారం తనిఖీ చేశారు.
అక్కడి సమస్యల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనం బాగాలేదని అందుకే ఇంటికాడ నుంచి తెచ్చుకుంటున్నామని విద్యార్థులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. కనీసం తాగడానికి మంచినీళ్లు కూడా లేవని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఏర్పాటు చేసిన వాటర్ ఫిల్టర్‌ను కూడా మున్సిపల్ అధికారులు తీసుకపోయి ఇప్పటివరకు తీసుకురాలేదని ఫిర్యాదు చేశారు. వెంటనే స్కూల్లో వాటర్ ఫిల్టర్ అమర్చాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.
అగంన్వాడీలో అపరిశుభ్రతపై ఆగ్రహం..
మల్లాపూర్‌లోని అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే అపరిశుభ్రతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీ కేంద్రంలో కరెంటు సరఫరా లేకపోవడం చూసి మండిపడ్డారు. కేంద్రంలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలనిఅధికారులను ఆదేశించారు. అంగన్వాడీ పిల్లలతో కాసేపు సరదాగా ముచ్చటించారు. మండల విద్యాధికారి కృష్ణయ్య, మల్లాపూర్ పాఠశాల హెడ్మాస్టర్, మాజీ కార్పొరేటర్ జనగే భారతమ్మ-కొమురయ్య యాదవ్, మాజీ కౌన్సిలర్ దండు గణేష్ ముదిరాజ్, పోరెడ్డి వెంకటరెడ్డి, సిల్వేరి సాంబశివ, శ్రీనివాస్ యాదవ్, పురుషోత్తం, గణేష్ ముదిరాజ్, మాధవరెడ్డి, మాజీ కోఆప్షన్ సభ్యుడు ఖలీల్ పాషా, సంధ్య నాగేష్, సురేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.