కందుకూరు, మే 18: ఎన్నికలకు ముందు అరచేతిలో వైకుంఠం చూపించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో తీవ్రంగా విఫలమైందని మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి విమర్శించారు. ఆదివారం కందుకూరు మండల కేంద్రంలో ఆమె మాట్లాడుతూ.. ఆరు గ్యారెంటీలతో పాటు 420 హామీలను అటకెక్కించినట్లు వివరించారు. అధికారంలోకి వచ్చి 16 నెలలు గడుస్తున్నా.. కోటి మహిళలను కోటీశ్వరులను చేస్తానని చెప్పిన వాగ్దానం సహా అన్నిటిని విస్మరించారని తెలిపారు.
ఒక్క హామీని కూడా అమలు చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని సబిత ఆరోపించారు. ప్రజలు ఈ ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. పదవులను కాపాడుకోవడానికి ఉన్న శ్రద్ధ ప్రజాసమస్యల పరిష్కారంపై లేదని అన్నారు. రుణమాఫీ, రైతుబంధు, మహిళకు కల్యణ లక్ష్మి, తులం బంగారం, స్కూటీ వంటి హామీలను తుంగలో తొక్కారని అన్నారు.. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో కూడా ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని సబిత ఆరోపించారు.
కేవలం కాంగ్రెస్ నాయక్తులకు ఇందిరమ్మ ఇళ్లులు మంజూరు చేస్తున్నారని ఆరోపించారు. పాలన చేతకాక సీఎం, మంత్రులు ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తున్నారని తెలిపారు. పాలనపై దృష్టి పెట్టి ప్రజాసమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గంగాపురం లక్ష్మీ నర్సింహారెడ్డి, కాకి దశరథ ముదిరాజ్, పీఏసీఎస్ చైర్మన్ దేవరశెట్టి చంద్రశేఖర్, మాజీ డైరెక్టర్ ప్రకాశ్ రెడ్డి, దేవిలాల్ నాయక్, మాజీ సర్పంచ్ జంగయ్య, సురసాని సుదర్శన్ రెడ్డి ,సోషల్ మీడియా కన్వీనర్ దీక్షిత్ రెడ్డి, కార్యాలయ కార్యదర్శి బర్కం వెంకటేశ్, సామయ్య, బడంగ్పేట్, మీర్పేట్ అధ్యక్షులు రామిరెడ్డి, కామేష్ రెడ్డి, గణేశ్ రామానుజన్, తేజ నాయక్ , వినోద్ పాల్గొన్నారు.