అమీర్‌పేట్, అక్టోబర్ 9: ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు బాకీ పడిపోయిందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. 22 నెలల కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్కవర్గం ప్రజలు ఆనందంగాలేరని మాధవరం విమర్శించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అభ్యర్ధి మాగంటి సునీత గోపీనాథ్, వారి కుమారుడు మాగంటి వాత్సల్యనాథ్‌తో కలిసి ఎమ్మెల్యే ఎర్రగడ్డ డివిజన్లోని డి.శంకర్‌లాల్‌నగర్, సుల్తాన్నగర్లలో ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ బాకీ కార్డులను అందజేశారు. బీఆర్ఎస్ అభ్యర్ధి మాగంటి సునీత గోపీనాథ్‌కు మద్దతుగా జరుగుతున్న ప్రచారానికి అనూహ్య స్పందన వస్తోంది. మహిళలు, వృద్ధులు, మైనార్టీలు మాగంటి సునీతకు తమ మద్దతు తెలుపుతున్నారు.
గత దశాబ్ద బీఆర్ఎస్ హయాంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రత్యేకించి ఎర్రగడ్డ డివిజన్లో మురికివాడలకు మౌలిక వసతులు కల్పించడంలో ఎమ్మెల్యే గోపీనాథ్ ఎంతో కృషి చేశారని, ప్రభుత్వం మారిన తర్వాత గత 22 నెలలుగా అభివృద్ధి జాడ లేకుండా పోయిందని, హైడ్రా పేరుతో కూల్చివేతలు మాత్రం జరుగుతున్నాయంటూ అడుగడుగునా ప్రజలు తమ ఫిర్యాదులను ఎత్తి చూపుతున్నారని ఎమ్మెల్యే మాధవరం తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రూపంలో తమ నిరసనను వ్యక్తం చేసేందుకు ప్రజలకు మంచి అవకాశం వచ్చిందని, ఈ ఎన్నికల్లో ఓటు ద్వారా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధిచెప్పాలని మాధవరం ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎర్రగడ్డ డివిజన్ అధ్యక్షుడు సంజీవ, ప్రధాన కార్యదర్శి మహ్మద్ అజీమ్, నాయకులు సయ్యద్ రసూల్, మహమూద్, షేక్జావెద్తో పాటు పార్టీకి చెందిన మహిళా, యువజన విభాగాల ప్రతినిధులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.