వెంగళరావునగర్, అక్టోబర్ 18: జూబ్లీహిల్స్ ఎన్నికల నామినేషన్ల పర్వంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్ నామినేషన్ సమర్పించేటప్పుడు మాజీ మంత్రి కేటీఆర్, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి,కార్పొరేటర్ రాజ్‌కుమార్ పటేల్‌తో పాటు దివంగత బోరబండ బీఆర్ఎస్ మైనార్టీ నాయకుడు సర్దార్ సతీమణి సమీనా ఉన్నారు. కాగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ నామినేషన్ కార్యక్రమంలో మంత్రులు వివేక్, పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల విజయలక్ష్మిలతో పాటు సర్దార్ ఆత్మహత్య కేసులో నిందితురాలైన బాబాఫసియుద్దీన్ భార్య హబీబా సుల్తానా ఉన్నారు.
నిందితులకు కొమ్ముకాస్తూ కేసును నిర్వీర్యం చేస్తున్నారనే ఆరోపణలకు కాంగ్రెస్ నాయకుల తీరుతో మరింత బలం చేకూరింది. సర్దార్ ఆత్మహత్యకు మాజీ డిప్యూటీ మేయర్, కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్, అతడి భార్య హబీబా సుల్తానా,పీఏ సప్తగిరి కారణమని ఆరోపణలతో బోరబండ పోలీసుస్టేషన్లో కేసు నమోదై ఉంది. బాధితుల పక్షాన అండగా ఉంటూ సమీనాకు పార్టీ అండగా ఉందనే సంకేతాలనిస్తూ బీఆర్ఎస్ నామినేషన్ పర్వం చోటుచేసుకోగా..నిందితుల పక్షాన కాంగ్రెస్ నామినేషన్ పర్వాన్ని నిర్వహించడం గమనార్హం.