Maganti Gopinath | బంజారాహిల్స్, ఏప్రిల్ 7: రాష్ట్ర సాధనతో పాటు అభివృద్ధిలో తెలంగాణను అగ్రస్థానంలో నిలిపిన ఉద్యమసారథి కేసీఆర్ మరిన్ని విజయాలు సాధించేందుకు సిద్ధంగా ఉన్నారని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. ఈనెల 27న వరంగల్ లో నిర్వహించనున్న బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ రజతోత్సవ సభకు సంబంధించిన జనసమీకరణ, తదితర అంశాలపై సోమవారం జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తన క్యాంపు కార్యాలయంలో కార్పొరేటర్లు, పార్టీ ముఖ్యనేతలతో సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాగంటి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమ సారథి కేసీఆర్ నాయకత్వంలో 25 ఏండ్ల కిందట ఏర్పాటైన బీఆర్ఎస్ పార్టీ అనేక విజయాలు సాధించిందన్నారు. 25 ఏండ్ల బీఆర్ఎస్ ప్రయాణాన్ని నెమరువేసుకుంటూ రానున్న రోజుల్లో మరిన్ని విజయాలు సాధించేందుకు పార్టీ అధినేత కేసీఆర్ సిద్ధమవుతున్నారన్నారు. తెలంగాణ ప్రజలు ఏడాదిన్నర కాంగ్రెస్ పార్టీ పాలనతో విసిగిపోయారన్నారు.
ముఖ్యంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకుల అరాచకాలు మితిమీరిపోయాయని, భూకబ్జాలు, బెదిరింపులు చేస్తూ సామాన్యులను ఇబ్బందులు పెడుతున్నారన్నారు. వరంగల్ లో నిర్వహించనున్న రజతోత్సవ సభకు జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి 3వేలమంది కార్యకర్తలు, అభిమానులు వచ్చేందుకు రవాణా ఏర్పాట్లు చేశామన్నారు. డివిజన్ వారీగా, బూత్ వారీగా సభకు వచ్చేవారి వివరాలను సిద్ధం చేయాలని పార్టీ నేతలను ఆదేశించారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు రాజ్ కుమార్ పటేల్, దేదీప్యరావు, సీనియర్ నేతలు షరీఫ్, జావేద్, విజయ్ కుమార్, అజయ ,శ్యామ్ రావు, రామకృష్ణ, నర్సింగ్ రావు, అప్పు ఖాన్, అరుణ్, ఫయాజ్, కే ఎన్ రెడ్డి, రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.