హైదరాబాద్ : కార్మికుల సమస్యల పరిష్కారం కోసం తలసాని శంకర్ యాదవ్ ఎంతో కృషి చేశారని ఎమ్మెల్సీ మధుసూదనాచారి(Madhusudanachari), మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్(Srinivas Goud) అన్నారు. రెండు రోజుల క్రితం మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడు, మోండా మార్కెట్ అధ్యక్షుడు తలసాని శంకర్ యాదవ్ మృతి చెందారు. విషయం తెలసుకున్న వారు బుధవారం రాధికా కాలనీలోని శంకర్ యాదవ్ నివాసానికి చేరుకొని శంకర్ యాదవ్ చిత్రపటం వద్ద నివాళులు(Tribute) అర్పించారు.
అనంతరం మాజీమంత్రి శ్రీనివాస్ యాదవ్, ఇతర కుటుంబ సభ్యులను వారు పరామర్శించి తమ ప్రగాఢ సంతాపం, సానుభూతి ని తెలిపారు. మోండా మార్కెట్ అధ్యక్షుడిగానే కాకుండా బోయిన్ పల్లి మార్కెట్ ట్రేడర్స్ అధ్యక్షుడిగా కూడా పని చేసిన శంకర్ యాదవ్ అటు ట్రేడర్స్, ఇటు కార్మికులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి పాటుపడ్డారని గుర్తు చేశారు. శంకర్ యాదవ్ మరణించారంటే తాము ఇంకా నమ్మలేకపోతున్నామని పేర్కొన్నారు. శంకర్ యాదవ్ మరణ వార్త తమను చాలా కలచి వేసిందన్నారు. శంకర్ యాదవ్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని, వారి కుటుంబ సభ్యులకు మనిధైర్యం ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్ధించారు.