వెంగళరావునగర్, నవంబర్ 13: అతడో మోసగాడు. తన మాయమాటలతో మభ్యపెట్టి లక్షల్లో దండుకుని ఉడాయిస్తాడు. తాను పేరుగాంచిన జ్యోతిష్య నిపుణుడనని.. రాజకీయ పలుకుబడి, పరపతి ఉన్నదని చెప్పి నేవీలో ఉద్యోగం పేరిట ఒకరిని, వాస్తు దోషానికి పరిహారం చేస్తానని నమ్మించి మరొకరిని, వ్యాపారంలో పెట్టుబడి పెడితే అధిక లాభాలంటూ వేరొకరిని మోసం చేసి లక్షల రూపాయలు దోచుకున్నాడు. ఈ మాయగాడిని మధురానగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ కథనం ప్రకారం.. ఎల్లారెడ్డిగూడలోని హెచ్‌బీ రెసిడెన్సీలో ఉమా మధుసూదన్ (52) మార్చి నెలలో అద్దెకు దిగాడు. అతడితో పాటు అతడి ఫ్లాట్‌లో పి.సంతోష్‌కుమార్, జె.రాకేశ్, పి.సుమాంజలి కూడా ఉన్నారు.
తాను జ్యోతిష్య నిపుణుడనని.. ఓఆర్ఎస్ హెల్త్ డ్రింక్స్ బిజినెస్‌తో పాటు తనకు రాజకీయంగా మంచి పలుకుబడి కూడా ఉన్నదంటూ చుట్టుపక్కల వారికి చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో ఇదే ప్రాంతంలో ఉంటున్న నర్సింగరావు తనకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయని, తన ఇంటి వాస్తును చూడాలని ఉమా మధుసూదన్‌ను సంప్రదించాడు. పూజలు చేయాలని చెప్పి అతడి వద్ద నుంచి రూ.లక్షలు దండుకున్నాడు. ఇదే అపార్ట్మెంట్లో వాచ్‌మన్‌గా పనిచేస్తున్న ఎస్.రాంబాబు వద్ద కూడా అతడి కుమారుడికి ఇండియన్ నేవీలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ.3లక్షలు తీసుకున్నాడు.
ఉద్యోగం రాకపోవడంతో తన రాజకీయ పలుకుబడితో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తానని నమ్మబలికి మరో లక్ష దండుకున్నాడు. ఇదే అపార్ట్మెంట్లో ఉండే పల్లే సరితతో వ్యాపారంలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయంటూ నమ్మించి రూ.7.5 లక్షలు స్వాహా చేశాడు. ఎంతకీ ఉద్యోగాలు రాకపోవడం.. డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు కాకపోవడం.. వ్యాపారంలో ఇస్తానన్న లాభాల మాట అటుంచి.. అసలు డబ్బే ఇవ్వలేదు. అంతేకాదు.. చెప్పాపెట్టకుండా ఇంటికి తాళం వేసి ఉడాయించాడు. వేర్వేరు ఫిర్యాదులతో మూడు కేసులు నమోదు చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుడు మధుసూదన్, అతడికి సహకరించిన సంతోష్, రాకేశ్, సుమాంజలిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. బాధితులు ఇంకా ఉంటే పీఎస్‌లో ఫిర్యాదు చేయాలని మధురానగర్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ సూచించారు.