ఆదర్శంగా నిలిచిన మదన్‌పల్లి పాత తండా
వరుసగా నాలుగోసారి మొదటిస్థానం
శంషాబాద్ రూరల్, మార్చి 26: రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి నేటి వరకు ప్రతి సంవత్సరం వందశాతం ఆస్తిపన్నుల వసూళ్లలో శంషాబాద్ మండలంలోని మదన్‌పల్లి పాత తండా ముందంజలో ఉన్నది. నూటికి నూరుశాతం ఆస్తి పన్ను వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసికట్టుగా పని చేసి వందశాతం ఆస్తిపన్నును వసూలు చేసి రంగారెడ్డి జిల్లాలోనే మొదటి వరుసలో పాత తండాను నిలిపారు. మొత్తం 650 మంది జనాభాతో ఉన్న మదన్‌పల్లి పాత తండా నేడు ఆదర్శంగా నిలిచింది.
ఇచ్చిన హామీ ప్రకారం..
గతంలో గిరిజన తండాలకు ప్రత్యేక పంచాయతీలు లేక అనేక ఇబ్బందులు పడిన గిరిజనులకు రాష్ట్రం ఏర్పాడిన తర్వాత సీఎం కేసీఆర్ 500 జనాభా ఉన్న గిరిజన తండాలు, గూడాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలు చేస్తామని ఇచ్చిన హామీ మేరకు 2018లో అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా శంషాబాద్ మండలంలోని మదన్‌పల్లి పాత తండా, మదన్‌పల్లి కొత్త తండా, అలీకోల్ తండా, పెద్దషాపూర్ తండా, పెద్దతూప్ర తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ప్రకటించారు. అప్పటి నుంచి నేటి వరకు వరుసగా నాలుగోసారి మదన్‌పల్లి పాత తండా ఆస్తిపన్ను వసూళ్లలో నూటికి నూరుశాతం వసూలు చేసి రంగారెడ్డ జిల్లాలోనే మొదటిస్థానంలో నిలిచింది. మదన్‌పల్లి పాత తండాలో 233 ఇండ్లకు గాను రూ.4,89,685 వందశాతం వసూలు చేశారు.
ప్రజల సహకారంతో..
కొత్తగా ఏర్పడిన మా తండాను అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలుపాలనే లక్ష్యంతో గ్రామ పంచాయతీ ఏర్పడినప్పటి నుంచి ప్రత్యేక చొరవతీసుకొని ఇంటింటికీ తిరిగి ప్రజలకు అవగాహన కల్పించాం.. ప్రజల సహకారంతో వందశాతం ఆస్తిపన్ను వసూలు చేశాం.
– రవీందర్‌నాయక్, సర్పంచ్ మదన్‌పల్లి పాతతండా
నాలుగేండ్లుగా..
ప్రజలు, ప్రజాప్రతినిధుల సహకారంతో వందశాతం ఆస్తిపన్ను వసూలు చేయగలిగాం. నాలుగు సంవత్సరాలుగా వంద శాతం ఆస్తిపన్ను వసూలు చేసి గ్రామాన్ని ఆదర్శంగా తయారు చేస్తున్నాం. – శ్రీకాంత్, పంచాయతీ కార్యదర్శి
7 పంచాయతీలు వందశాతం పూర్తి..
మండలంలోని మదన్‌పల్లి పాత తండా, అలీకోల్తండా, రషీద్‌గూడ, నానాజీపూర్, జూకల్, పిల్లోనిగూడ, చిన్నగోల్కొండ గ్రామాల్లో వందశాతం ఆస్తి పన్ను వసూలు చేశాం. మదన్‌పల్లి పాతతండా గత నాలుగు సంవత్సరాలుగా ముందు వరుసలో ఉంది.
– సౌజన్య, శంషాబాద్ ఎంపీవో