సిటీబ్యూరో, జనవరి 9 (నమస్తే తెలంగాణ) : నిత్యం రద్దీగా ఉండే మెట్రోకు ప్రభుత్వం నిధులిస్తే గానీ కొత్త కోచ్‌లు వచ్చే పరిస్థితి లేదు. తాజాగా కొత్త కోచ్‌లను ఏర్పాటు చేయాలని ప్రయాణికుల వెల్లువెత్తున్న డిమాండ్ల నేపథ్యంలో… బోగీలను తీసుకొచ్చేందుకు అవసరమైన ఆర్థిక సహకారం అందించాలని ఎల్అండ్టీ సంస్థ ప్రభుత్వాన్ని కోరుతున్నది. నిత్యం ట్రాఫిక్ రద్దీ ఉండే మార్గాల్లో కొత్త కోచ్‌ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసిన నేపథ్యంలో.. ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో.. ప్రభుత్వం సహకరిస్తే కొనేందుకు సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు. ట్రిప్పుల సంఖ్యను పెంచాలన్నా.. బోగీల సంఖ్యను అప్‌గ్రేడ్ చేయడానికి ప్రభుత్వ సాయంతో సాధ్యమేనని తేల్చి చెప్పారు. దీంతో ప్రభుత్వ ఖజానా నుంచి నిధులిస్తే గానీ, కొత్త కోచ్‌లు వచ్చే అవకాశమే లేదని తెలుస్తున్నది.
ప్రస్తుతం 1075 ట్రిప్పులు..
ప్రస్తుతం 1075 ట్రిప్పుల ద్వారా రవాణా సదుపాయాలను అందిస్తున్న హైదరాబాద్ మెట్రో… చాలీచాలనీ బోగీలతోనే గడిచిన ఐదారేండ్లుగా నెట్టుకొస్తున్నది. పీక్ అవర్స్‌లో ప్రయాణికులతో కిక్కిరిపోతున్నా… అవే మూడు బోగీలతోనే లాక్కోస్తున్నది. కనీసం రద్దీ ఎక్కువగా ఉండే సమయంలోనైనా అదనపు బోగీలను ఏర్పాటు చేయకపోవడంతో మెట్రో ప్రయాణికులకు తోపులాట నడుమనే రాకపోకలు సాగిస్తున్నారు. నిత్యం రద్దీగా నాగోల్ – రాయదుర్గం మార్గంలోనైతే… మూడు సర్వీసులు వచ్చిన కూడా ఫ్లాట్‌ఫారం మీద ఉండే రద్దీ తగ్గడం లేదు.
కొత్త రైళ్ల కొనుగోలుకు..
మూడు బోగీలు ఉండే 10 కొత్త ట్రైన్లను కొనుగోలు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు, ఇప్పటికే సంబంధిత ఉత్పత్తి సంస్థలను గుర్తించి సంప్రదింపులు చేసినట్లుగా తెలిసింది. ప్రస్తుతం 57 హ్యుందాయ్ రోటెమ్ త్రీ కోచ్‌లతో కూడిన రైళ్ల ఉత్పత్తి తగ్గిపోవడంతో కొత్త డిజైన్ల ఎంపికపై దృష్టి పెట్టారు. అయితే ఇందుకు పుణె, నాగ్‌పూర్ మెట్రో సంస్థలను ఆశ్రయించారు. అయితే ఆయా సంస్థల వద్ద చాలినన్నీ అదనపు కోచ్‌లు లేవని తెలిసింది. ఈ క్రమంలోనే కొత్త డిజైన్లతో కూడిన ట్రైన్లను తీసుకువచ్చే ప్రతిపాదనలు ఉన్నా… ఎల్ అండ్ టీ వద్ద ఉన్న ఆర్థిక పరమైన అంశాలతో వెనుకడుగు వేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ప్రభుత్వం సహకరిస్తే…. 10 ట్రైన్లను తీసుకువస్తామంటున్నారు.
కొత్త కోచ్‌లకు టైం కావాలే…
ప్రస్తుతం ఉన్న కోచ్‌లతో నిత్యం 5 లక్షల మందిని మెట్రో సంస్థ గమ్యస్థానాలకు చేర్చుతున్నది. అయితే టైం ఫ్రీక్వెన్సీని సర్దుబాటు చేయగలిగితే… ప్రయాణికుల సంఖ్యను 7 లక్షలకు పెంచే వీలు ఉందని తెలిసింది. అయితే పది లక్షల మంది ప్రయాణించేందుకు కచ్చితంగా మరో 10 కోచ్‌లు ఉంటే గానీ సాధ్యం కాదని తెలిసింది. కొత్త మార్గాల్లో కొత్త ట్రైన్లతో పది లక్షల ప్రయాణికుల మార్క్‌ను దాటే అవకాశం ఉందన్నారు. దీంతోపాటు ప్రస్తుతం ఉన్న రైడర్ షిప్ కూడా పూర్తి సామర్థ్యానికి కంటే 10 శాతమే తక్కువ ఉందని మెట్రో వర్గాలు చెబుతున్నాయి. అయితే కొత్త కోచ్‌ల డిజైన్లు ఖరారు చేసేందుకు ఆరు నెలల పడుతుందని, మరో ఏడాదిన్నర తర్వాతే కొత్త ట్రైన్లు అందుబాటులోకి వస్తాయని.. అప్పటి వరకు పాత విధానంలోనే ప్రయాణికులకు మెరుగైన రవాణా సేవలు అందిస్తామని మెట్రో వర్గాలు చెబుతున్నాయి.