సిటీబ్యూరో, జూన్ 25 (నమస్తే తెలంగాణ) : వందల కోట్ల ఆశలతో మొదలైన ఎల్ఆర్ఎస్ అంచనాలు తలకిందులయ్యాయి. హెచ్ఎండీఏ పరిధిలోని 1200 గ్రామాల పరిధిలోని అనధికారిక లే అవుట్ల ద్వారా భారీ ఆదాయం సమకూరుతుందని ఆశించినా ప్రయోజనం లేకుండా పోయింది. మొత్తంలో 3.60 లక్షల దరఖాస్తులలో 2.50 లక్షల దరఖాస్తులకు ఫీజులు చెల్లించాలని నోటీసులు జారీ చేసినా.. ఇప్పటికీ వరకు 50 శాతం కూడా పూర్తి కాలేదు.
ఇక ఫీజులు చెల్లించిన వారికి కూడా ప్రొసీడింగులు ఇప్పటికీ జారీ కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా 25 శాతం రాయితీ గడువును జూన్ నెలాఖరు వరకు పొడిగించినా జనాల నుంచి స్పందన రావడం లేదు. హెచ్ఎండీఏ పరిధిలో సుమారు 3.60 లక్షల మంది ఓపెన్ ప్లాట్లను క్రమబద్ధీకరణకు దరఖాస్తుకు వచ్చాయి. ఇందులో దరఖాస్తుల పరిశీలన తర్వాత 2.50 లక్షల దరఖాస్తులకు ఫీజులు చెల్లించాలని నోటీసులు జారీ చేశారు. వీటిలో ఇప్పటివరకు 70వేల దరఖాస్తుదారులు మాత్రమే ఫీజులు చెల్లించడంతో హెచ్ఎండీఏలో ఎల్ఆర్ఎస్ నీరుగారిపోతున్నది.
ఫీజులు చెల్లించిన తర్వాత దరఖాస్తులను మూడు దశల్లో పరిశీలించిన తర్వాతే ఫైనల్ ప్రొసీడింగ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఏ ఒక్క దశలోనూ కూడా నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్లు ఉంటే ప్రొసీడింగ్స్ జారీ చేయడానికి వీల్లేదు. ఈ క్రమంలో రెవెన్యూ, ఇరిగేషన్, టైటిల్ క్లియరెన్స్ వారీగా దరఖాస్తులను పరిశీలించిన తర్వాత ప్రొసీడింగ్స్ జారీ చేస్తున్నారు.
ఈ వ్యవహారంలో సిబ్బంది కొరత, టెక్నికల్ సమస్యలతో ప్రక్రియ జాప్యం జరుగుతుండగా, నోటీసులు జారీ చేసిన దరఖాస్తుదారులు ఫీజులు చెల్లించినా… హెచ్ఎండీఏ అంచనా వేసిన రెవెన్యూ సమకూరే అవకాశం కనిపించడం లేదు. దాదాపు 1200 కోట్ల అంచనా వ్యయంతో ప్రక్రియ చేపడితే.. ఇప్పటివరకు రూ. 250 కోట్లు కూడా దాటలేదు.