LRS | మేడ్చల్, జనవరి 2 (నమస్తే తెలంగాణ): ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల సంగతి అంతేనా అన్న అనుమనాలు కలుగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిశీలించి.. భూక్రమబద్ధీకరణ చేస్తామని ప్రకటించినా.. అధికారులు మాత్రం దరఖాస్తుల పరిశీనలలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా 1,43 లక్షల దరఖాస్తులు వచ్చాయి.
వచ్చిన లక్ష 43 వేల అర్జీలలో దరఖాస్తుల పరిశీలన ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు 16 వేల 2 వందల దరఖాస్తులను మాత్రమే పరిశీలించినట్లు తెలిసింది. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలనపై ఉన్నత స్థాయి అధికారులు పట్టించుకోకపోవడం మూలంగానే దరఖాస్తుల పరిశీలన ముందుకు సాగడం లేదని తెలుస్తున్నది.
దరఖాస్తుదారులు ఇచ్చిన దరఖాస్తుల్లో లేని ధ్రువపత్రాలను తిరిగి సమర్పించేలా ఎలాంటి అవగాహన కల్పించకపోవడం వల్ల దరఖాస్తుదారులకు ఏం చేయాలన్నది అర్థం కాకుండా పోతున్నది. జిల్లాలోని మున్సిపాలిటీలు, జిల్లా కలెక్టరేట్, ఎంపీడీవో కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ నామా మాత్రంగానే ఏర్పాటు చేసినట్లు దరఖాస్తుదారులు ఆరోపిస్తున్నారు.