సిటీబ్యూరో, జులై 22 (నమస్తే తెలంగాణ) : వందల కోట్ల ఆశలతో మొదలైన ఎల్ఆర్ఎస్ ప్రక్రియ ఆశలన్నీ ఆడియాశలయ్యాయి. హెచ్ఎండీఏ పరిధిలోని 1200 గ్రామాల పరిధిలోని అనధికారిక లే అవుట్ల క్రమబద్ధీకరణ ద్వారా భారీ ఆదాయం తలకిందులయ్యాయి. మొత్తం 3.60 లక్షల దరఖాస్తుల్లో 70 వేల దరఖాస్తులు మాత్రమే ఫీజులు చెల్లించగా.. ఇప్పటికీ 30శాతం దరఖాస్తుదారులకు కూడా ప్రొసీడింగులు అందలేవు. ఫీజులు చెల్లించాలని 2.5 లక్షల మందికి నోటీసులు జారీ చేసినా.. 25 శాతం రాయితీ ప్రయోజనాల కోసం కొద్ది మందే ముందుకు వచ్చి ఫీజులు చెల్లించారు. అయితే ఫీజులు చెల్లించిన వారికి నిర్ణీత గడువు లోగా ప్రొసీడింగ్స్ జారీ చేయాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నా… హెచ్ఎండీఏ పరిధిలో జారీ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది.
కార్యాలయం వద్ద పడిగాపులు..
హెచ్ఎండీఏ పరిధిలో సుమారు 3.60లక్షల మంది ఓపెన్ ప్లాట్ల క్రమబద్ధీకరణకు దరఖాస్తులు వచ్చాయి. ఇందులో దరఖాస్తుల పరిశీలన తర్వాత 2.50లక్షల దరఖాస్తులకు ఫీజులు చెల్లించాలని నోటీసులు జారీ చేశారు. వీటిలో ఇప్పటివరకు 70వేల దరఖాస్తుదారులు మాత్రమే ఫీజులు చెల్లించి, ప్రొసీడింగ్స్ కోసం దరఖాస్తుదారులు ఎదురుచూస్తున్నారు. ఫీజులు చెల్లించిన తర్వాత దరఖాస్తులను మూడు దశల్లో పరిశీలించిన తర్వాతే ఫైనల్ ప్రొసీడింగ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఏ ఒక్క దశలోనూ కూడా నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్లు ఉంటే ప్రొసీడింగ్స్ జారీ చేయడానికి వీల్లేదు.
ఈ క్రమంలో రెవెన్యూ, ఇరిగేషన్, టైటిల్ క్లియరెన్స్ వారీగా దరఖాస్తులను పరిశీలించిన తర్వాత ప్రొసిడింగ్స్ జారీ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఫీజులు చెల్లించిన మొత్తం దరఖాస్తుదారుల్లో 30శాతం మందికి కూడా ప్రొసీడింగ్స్ జారీ కాలేదని తెలిసింది. ఈ వ్యవహారంలో సిబ్బంది కొరత, టెక్నికల్ సమస్యలతో ప్రక్రియ జాప్యం జరుగుతుందని హెచ్ఎండీఏ సిబ్బంది వివరించారు. దీంతో దాదాపు రూ. 1200 కోట్ల అంచనా వ్యయంతో ప్రక్రియ చేపడితే, ఇప్పటివరకు రూ. 250 కోట్లు కూడా దాటలేదు. కనీసం ఫీజులు చెల్లించిన వారికైన ప్రొసిడింగులను అందజేస్తే… కట్టిన డబ్బులకైన ఎలాంటి ఆందోళన లేకుండా దరఖాస్తులుదారులు ఉంటారు. కానీ హెచ్ఎండీఏ యంత్రాంగం దరఖాస్తుదారులను కార్యాలయం తిప్పుకుంటూనే ఉంది.