సిటీబ్యూరో, ఫిబ్రవరి 7(నమస్తే తెలంగాణ):సైబర్ నేరగాళ్లు కేవలం బాధితుల బ్యాంకు ఖాతాలను మాత్రమే ఖాళీ చేయడం లేదని, వారి భవిష్యత్తును, కుటుంబాల ఆనందాన్ని కూడా హైజాక్ చేస్తున్నారని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ అన్నారు. శనివారం ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని పీఎస్ఆర్ శ్లోక కన్వెన్షన్‌లో జాగృత్ హైదరాబాద్-సురక్షిత్ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సైబర్ క్రైమ్ అవగాహన సదస్సుకు సీపీ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ నగరంలో రోజుకు సైబర్ మోసాల వల్ల ప్రజలు రూ.1కోటి వరకు మోసపోతున్నారని గణాంకాలతో సహా వివరించి బంగారం, వెండి ధరల హెచ్చుతగ్గులను సాకుగా చూపించి అపరిచితులు చేసే ట్రేడింగ్ ప్రతిపాదనలు నమ్మవద్దన్నారు. సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత చిత్రాలను, సమాచారాన్ని పంచుకునేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలని తెలియని వ్యక్తులు పంపే హానికరమైన ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేయవద్దని, ఏటీపీలు ఎవరితో పంచుకోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో లా అండ్ ఆర్డర్ అడిషనల్ సీపీ తఫ్సీర్ ఇక్బాల్, శంషాబాద్ డీసీపీ రాజేశ్, సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్‌బాబు, శంషాబాద్ ఏసీపీ శ్రీకాంత్‌గౌడ్, ఆదిభట్ల ఏసీపీ ప్రదీప్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సరైన ఆధారాలతో నేరాన్ని నిరూపించాలి..!
సైబరాబాద్ పోలీస్ రివార్డ్ మేళాలో సీపీ డా.ఎం.రమేశ్ క్రిమినల్ కేసుల్లో సరైన ఆధారాలతో నేరాన్ని నిరూపించి, దోషులకు శిక్షపడేలా చేసినప్పుడే బాధితులకు నిజమైన న్యాయం జరుగుతుందని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా.ఎం.రమేశ్ పేర్కొన్నారు. శుక్రవారం గచ్చిబౌలిలోని కమిషనరేట్ కార్యాలయంలో 2025-26 సంవత్సరానికి గాను రివార్డ్మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా నేరనిరూపణలో కీలకపాత్ర పోషించిన అధికారులు, ప్రాసిక్యూటర్లను ఆయన అభినందించి రివార్డులు అందజేశారు.
గత ఏడాది అక్టోబర్ 1 నుంచి ఈ ఏడాది జనవరి 31వరకు మొత్తం 12 కీలక కేసుల్లో నిందితులకు ఏడేళ్లు అంతకంటే ఎక్కువ కాలం జైలుశిక్షలు పడ్డాయని సీపీ తెలిపారు. ఇందులో కీలకపాత్ర పోషించిన 15 మంది పీపీ/ఏపీపీలు, 17 మంది విచారణాధికారులు, 19 మంది కోర్ట్ డ్యూటీ ఆఫీసర్లు, 13మంది లైజన్ ఆఫీసర్లు మొత్తం 64 మందికి సీపీ ప్రశంసాపత్రాలు, అవార్డులు అందించారు. కేసుల పురోగతిపై జోనల్ డీసీపీలు ప్రతీ నెలా పీపీలతో సమీక్షాసమావేశాలు నిర్వహించాలని సీపీ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ వి.వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ డైరెక్టర్ పి.మంజులాదేవి, డీసీపీలు శ్రీనివాస్, రితిరాజ్, శేషాద్రినిరెడ్డి, టి.అన్నపూర్ణ, ముత్యంరెడ్డి, సుధీంద్ర,శోభన్‌కుమార్, రంజన్ రతన్‌కుమార్, సృజన కరణం, సంజీవ్ తదితర పోలీసు అధికారులు పాల్గొన్నారు.