కంటోన్మెంట్, మార్చి 25: వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన ఓ లారీ ద్విచక్ర వాహనాలను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒక మహిళతో పాటు, ఒక వాహనదారుడు మృతి చెందాడు. ఈ ప్రమాదం బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బోయిన్పల్లి పోలీసుల కథనం ప్రకారం.. గుండ్ల పోచంపల్లి కె.వి.రెడ్డినగర్ కాలనీకి చెందిన ఆకాశ్ చవారియా వివాహం గతేడాది ముషీరాబాద్‌కు చెందిన నందినితో జరిగింది. సోమవారం హోలీ పండుగను పురస్కరించుకొని గుండ్ల పోచంపల్లి నుంచి ముషీరాబాద్‌కు రాత్రి ఆదివారం 11 గంటల సమయంలో వెళ్తుండగా.. సుచిత్ర డైరీ ఫారం వద్దకు రాగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఆకాశ్ చవారియా, నందిని ప్రయాణిస్తున్న బుల్లెట్‌ను ఢీకొట్టడంతో అదుపుతప్పి కింద పడిపోయారు.
కింద పడిన నందినిపై నుంచి లారీ ముందు టైరు వెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి. అదే లారీ ముందు వెళ్తున్న ఒక పల్సర్, యాక్టివాను కూడా ఢీకొట్టింది. యాక్టివాపై ప్రయాణిస్తున్న ఆకాశ్ రాజు, పల్సర్ పై ప్రయాణిస్తున్న దుర్గా ప్రసాద్‌కు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన నందినిని, ఆమె భర్త ఆకాశ్ చవారియాను సుచిత్రలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
సమాచారం అందుకున్న బోయిన్పల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పల్సర్‌పై ప్రయాణిస్తున్న ఆకాశ్ రాజును సైతం బాలానగర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతడు కూడా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పల్సర్‌పై ప్రయాణిస్తున్న దుర్గాప్రసాద్‌కు గాయాలైనట్లు పేర్కొన్నారు. ఘటన జరిగిన చోట ఫ్లై ఓవర్ పనులు సాగుతుండటంతో భారీగా వాహనాలు నిలిచిపోయి, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడని తెలిపారు. నందిని భర్త ఆకాశ్ చవారియా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.