Keesara | కీసర, ఫిబ్రవరి 26 : భక్తుల శివనామస్మరణతో కీసరగుట్ట పరిసర ప్రాంతమంతా దద్దరిల్లిపోయింది. బుధవారం మహాశివరాత్రి పర్వదినం కావడంతో శివభక్తులు భారీ ఎత్తున కీసరగుట్టకు చేరుకున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు కీసరగుట్టలో స్వామివారికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, ప్రత్యేక అభిషేకాలను నిర్వహించుకున్నారు. శివలింగాల చట్టూ భారీగా భక్తులు చేరుకొని వాటికి తేనే, ఆవుపాలు, పంచామృతంతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. క్యూలైన్లన్ని భక్తులతో క్రిక్కిరిసిపోయాయి.
జాతరకు వచ్చిన భక్తులకు చేసిన ఏర్పాట్లలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందని భక్తుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తం అయ్యాయి. ముఖ్యఅతిథులు కూడా విచ్చేసి స్వామివారిని దర్శించుకొని వెళ్లారు. రూ.500 టిక్కెట్ తీసుకొని గంటల తరబడి క్యూలైన్లలో నిలబడ్డ దర్శనం కాకపోవడంతో రోడ్డు బైటాయించి భక్తులు నిరసనకు దిగారు. కీసరగుట్ట పరిసర ప్రాంతమంతా భక్తులతో ఒక్కసారిగా కిటకిటలాడిపోయింది. తెల్లవారుజాము నుంచే స్వామి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు తలెత్తకుండా రాచకొండ సీపీ సుధీర్‌బాబు పర్యవేక్షణలో భారీ బందోబస్తు మధ్య సీసీ కెమెరాల నిఘా నీడలో కీసరగుట్ట జాతర బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి.
కీసరగుట్ట మహాశివరాత్రి పర్వదినం కావడంతో తెల్లవారుజామునే మాజీ రాజ్యసభ సభ్యులు సంతోష్‌కుమార్, మేడ్చల్ ఎమ్మేల్యే చామకూర మల్లారెడ్డి, మల్కాజ్గిరి ఎంపీ ఈటేల రాజేందర్, బీజేపీ సీనియర్ నేత డాక్టర్ లక్ష్మణ్, బోడుప్పల్ మాజీ మేయర్ అజయ్లతో పాటు పలువురు స్వామివారిని దర్శించుకున్నారు. మాజీ ఎంపీ సంతోష్‌కుమార్, మేడ్చల్ ఎమ్మేల్యే చామకూర మల్లారెడ్డిలు గర్భాలయంలో స్వామివారికి అభిషేకం నిర్వహించారు. వారికి ఆలయ చైర్మన్ శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం మాజీ ఎంపీ సంతోష్‌కుమార్ కీసరగుట్ట మీద మొక్కలు నాటారు.