NIMS | ఖైరతాబాద్, ఆగస్టు 19 : వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శితో పాటు నిమ్స్ డైరెక్టర్‌కు లోకాయుక్త నోటీసులు జారీ చేసింది. కరోనా సమయంలో నిమ్స్‌లో బెడ్లను అమ్ముకున్నట్లు ఆరోపిస్తూ మన్నె రాందాస్ అనే వ్యక్తి పంజాగుట్ట పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కేసు విచారణలో ఉండగా, ఇటీవల పటాకులు, భూదందాల ఆరోపణలు ఎదుర్కొన్న ఓ వైద్యాధికారి లోక్ అదాలత్‌లో రాజీ కుదుర్చుకునే కార్యక్రమాన్ని దగ్గరుండి చేపట్టారు. దీంతో ఫిర్యాదుదారుడు నిమ్స్‌లో బెడ్ల దందాపై పంజాగుట్ట పోలీసు స్టేషన్లో చేసిన ఫిర్యాదుతో పాటు ఇతర అన్ని వివరాలను సమగ్రంగా లోకాయుక్తకు సమర్పించారు. దీంతో విచారణకు స్వీకరించిన లోకాయుక్త ఇంతటి సున్నిత అంశాన్ని ఎలా రాజీ కుదుర్చుకుంటారని బాధ్యులపై సీరియస్ అయినట్లు తెలిసింది. తక్షణమే బెడ్లదందా, లోక్ అదాలత్‌లో రాజీ కుదిరిన అంశాలపై సమగ్ర వివరాలు అందజేయాలంటూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శితో పాటు నిమ్స్ డైరెక్టర్‌కు నోటీసులు పంపించారు.