Stolen Golden Ornaments | ఆదిబట్ల, ఫిబ్రవరి 06: ఓ మహిళ తన ఇంటికి తాళం వేసి పుట్టింటికి వెళ్లి వచ్చే సరికి తాళం పగుల గొట్టి ఇంట్లో ఉన్నబంగారం నగలతోపాటు నగదు ఎత్తుకెళ్లిన సంఘటన ఆదిభట్ల పోలీస స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది. ఆదిభట్ల సీఐ రాఘవేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం నాదర్గుల్లోని గ్రీన్‌హోమ్స్ కాలనీ వాసి ఎండీ ఫజులుల్ హక్ గత నెల 31న ఇంటికి తాళం వేసి నగరంలోని అత్తాపూర్‌లో గల పుట్టింటికి వెళ్లారు. తిరిగి గురువారం ఉదయం తన ఇంటికి వచ్చి చూడగానే ఇంటి తాళం విరిగి పోయి, తలుపులు తెరిచి ఉన్నాయి.
దీంతో గాభరా పడి తన పడక గదిలోకి చూస్తే.. అక్కడ తన అల్మారాలో ఉన్న 20 గ్రాముల రెండు బంగారు బిస్కెట్లు, 8 గ్రాముల బంగారు గొలుసు, 10 గ్రాముల బంగారు నెక్లెస్, రెండు గ్రాముల చొప్పున రెండు ఉంగరాలు, వెండి కాళ్ల కుండలు, వెండి కీ చైన్ మొత్తం 4 తులాల బంగారం, 25 తులాల వెండి, కొంత నగదును ఇంట్లోకి చొరబడి గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. ఈ విషయమై ఆమె తమకు ఫిర్యాదు చేశారని రాఘవేందర్ రెడ్డి చెప్పారు. వాటి విలువ రూ.92 వేలు ఉంటుందన్నారు. బాధితురాలి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.