సిటీబ్యూరో, నవంబర్ 19(నమస్తే తెలంగాణ): అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద చెరువు పెరిగిందని స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. తూములు, అలుగులు రెండూ మూసివేయడంతో పాటు బండ్ ఎత్తు పెంచి అన్ని ఔట్లెట్స్ మూసివేయడంతో చెరువు విస్తీర్ణం ఐదురెట్లు పెరిగిందని స్థానికులు ఫిర్యాదు చేశారు. చెరువు విస్తీర్ణం పెరగడంతో తమ ప్లాట్లన్నీ నీళ్లలో మునిగిపోతున్నాయని వాపోయారు. చెరువును కబ్జా చేయడం చూశాం.. కానీ చెరువే తమ భూములను కబ్జా చేస్తున్నదని వారు హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు చెప్పారు. అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని పెద్దచెరువు, కొత్త చెరువు, శంభుని కుంటను మంగళవారం హైడ్రా బృందం సందర్శించింది.
చెరువులతో పాటు వెంకటరమణకాలనీ, హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీ, పద్మారావునగర్ సరిహద్దు ప్రాంతాలను స్థానికుల ఫిర్యాదుల మేరకు రంగనాథ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అమీన్‌పూర్‌లోని పెద్ద చెరువు తూములు మూసివేయడంతో వాస్తవంగా 93.15 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువు ప్రస్తుతం 465 ఎకరాలకు విస్తరించిందని, దీంతో ఎఫ్టీఎల్ పరిధి పెరిగి తమ ప్లాట్లన్నీ నీటిలో మునిగిపోతున్నాయని స్థానికులు హైడ్రా కార్యాలయంలో గతంలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మంగళవారం అమీన్పూర్లో పెద్ద చెరువు తూములు మూసేసిన ప్రాంతాలను, ఎగువ భాగంలో లేఅవుట్లు మునిగిన తీరును కమిషనర్ పరిశీలించగా చెరువు ఎగువ భాగంలో ఉన్న లేఅవుట్ల ఓనర్లు మ్యాపుల ద్వారా తమ సమస్యలను వివరించారు.
అమీన్ పూర్ పెద్ద చెరువు అలుగులు, తూములు మూసేయడంతో ఎఫ్టీఎల్ పరిధి పెరిగి ఎగువన ఉన్న లేఅవుట్లు, నివాసాలు నీట మునిగాయని బాధితులు చెప్పారు. దీనిపై ప్రత్యేకమైన టెక్నికల్ బృందంతో సర్వే చేయిస్తామని, సర్వే రిపోర్ట్ ఆధారంగా మరో మూడునెలల్లో ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కమిషనర్ రంగనాథ్ వారికి చెప్పారు. మరోవైపు వెంకటరమణకాలనీ, పద్మావతికాలనీ, హెచ్ఎంటి కాలనీల్లో పార్కులు కబ్జాలకు గురయ్యాయని, ఒకరి లేఔట్లలోకి మరొకరు చొరబడి పార్కులు, రహదారులు ఆక్రమించారంటూ స్థానికులు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం రంగనాథ్ మాట్లాడుతూ… సర్వే విభాగంతో పాటు ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ శాఖల అధికారులతో ఓ కమిటీ వేసి వారు ఇచ్చిన నివేదికను ప్రభుత్వానికి తెలియజేసి ప్రభుత్వ సూచనల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు.
పద్మావతి లేఅవుట్లోకి చొరబడి తమ స్థలాలను కబ్జా చేశారంటూ కొంతమంది మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డిపై ఫిర్యాదు చేశారని, లేఅవుట్లను పరిశీలించిన తర్వాత పార్కులు, రహదారులు ఆక్రమణకు గురైనట్లుగా తమ సర్వేలో తేలితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వెంకటరమణకాలనీ లేఅవుట్‌కు సంబంధించి ఒక ఎకరం ఆక్రమణకు గురైనట్లు వచ్చిన ఫిర్యాదులపై విచారణ చేపట్టామని, గోల్డెన్ కీ వెంచర్ వాళ్లు వెంకటరమణకాలనీలోని పార్కును ఆక్రమించినట్లు వచ్చిన ఫిర్యాదుపై సర్వే జరిపించి విచారణ చేశామని తెలిపారు. శంభునికుంట ఎఫ్టీఎల్ పరిధిలోకి కొన్ని కట్టడాలు వచ్చాయంటూ తమకు ఫిర్యాదులొచ్చాయని, చెరువులకు సంబంధించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసులు కూడా నడుస్తున్నాయని రంగనాథ్ చెప్పారు. చెరువుకు మధ్యలో రోడ్డు నిర్మించి చెరువును వేరు చేశారని, ఒకవైపు మట్టితో కప్పి ఆక్రమణలకు పాల్పడినట్లు వచ్చిన ఫిర్యాదులపై విచారణ చేపడతామని రంగనాథ్ తెలిపారు.