HYDRA | బంజారాహిల్స్, జనవరి 19: హడ్రా మాటలు నీటి మూటలు అవుతున్నాయి. చెప్పేదొకటి.. చేసేదొకటిగా అగుపిస్తున్నది. ‘ప్రభుత్వ స్థలాలు, పార్కులు, చెరువుల కబ్జాలపై ఉక్కుపాదం మోపుతాం’ అంటూ తరచు ప్రకటనలు గుప్పించే రెవెన్యూ, జీహెచ్ఎంసీ, హైడ్రా మాటలు కొన్ని ప్రాంతాల్లో మాత్రం నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయా..? నగరం నడిబొడ్డున ఖరీదైన స్థలాలు కబ్జాలకు గురయినా పట్టించుకోకపోవడానికి అధికార పార్టీ నేతల ఒత్తిళ్లే కారణమా..? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. షేక్‌పేట మండల పరిధిలోని బంజారాహిల్స్ రోడ్ నం.14 నందినగర్ గ్రౌండ్స్‌లో ఏడాదిగా ఇబ్బడి ముబ్బడిగా ఆక్రమణలతో స్థానికంగా ఎన్నో స్థలాలు మాయమయ్యాయి.
ఎక్కడ చూసినా షెడ్లు, హోటళ్లు, పాన్‌షాపులు, ప్లాస్టిక్ షీట్లతో దుకాణాలతో విశాలంగా ఉన్న మైదానం కుంచించుకుపోయింది. కొంత మంది అధికార పార్టీ కార్యకర్తల కాసుల కక్కుర్తితో రోడ్ల పక్కనున్న స్థలాలు, వీధి స్థలాలను ఆక్రమించారు. దీంతో నందినగర్‌లోని మైదానం మొత్తం ఇరుకుగా మారింది. నిత్యం వందలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే ఈ ప్రాంతానికి ఆర్టీసీ బస్సులు కూడా రాలేని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకున్న కొంతమంది తాత్కాలిక షెడ్లు వేసుకొని, డబ్బాలు, బిల్డింగ్ మెటీరియల్ వేస్తూ ఇంకా వ్యాపారాలు ఏర్పాటు చేస్తున్నారు. మరి కొంతమంది అధికార పార్టీ కార్యకర్తలు నెలనెలా అద్దెలు వసూలు చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
దీనికి తోడు ప్రతి శుక్రవారం జరిగే వారాంతపు సంత రోజున పరిస్థితి మరీ ఘోరంగా తయారవుతుందని, కనీసం నడిచేందుకు కూడా అవకాశం లేకుండా షాపులు ఏర్పాటు చేయించి అద్దెలు వసూలు చేస్తారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాజీ సీఎం కేసీఆర్ నివాసానికి కూతవేటు దూరంలో ఉన్న నందినగర్ గ్రౌండ్ కళ్ల ముందే మాయమయిపోయినా రెవెన్యూ శాఖ అధికారులు, జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు, ట్రాఫిక్ విభాగం అధికారులు పట్టించుకోకపోవడం వెనక అధికార పార్టీ నేతల ఒత్తిళ్లే కారణమయి ఉంటాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నందినగర్ గ్రౌండ్స్‌లో ఆర్టీసీ బస్సును రివర్స్ చేసుకోవడానికి కూడా అవకాశం లేకపోవడంతో ఆరునెలలుగా ఇక్కడకు వచ్చే 47ఎన్, 127 ఎన్ బస్సులను ఆర్టీసీ అధికారులు నిలిపివేశారని, దీంతో తామంతా ఎక్కువ డబ్బు చెల్లించి ఆటోల్లో ప్రయాణించాల్సి వస్తోందని స్థానిక మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పోలీసు బందోబస్తు కోసం లేఖ రాశాం
నందినగర్ గ్రౌండ్లో ఆక్రమణలపై ఫిర్యాదులు వచ్చాయి. ఈ స్థలం మొత్తం ప్రభుత్వ స్థలంగా రికార్డుల్లో ఉంది. దీన్ని ల్యాండ్ బ్యాంక్ జాబితాలో చాలా ఏండ్ల క్రితమే చేర్చారు. ఆక్రమణలను తొలగించేందుకు జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగం, హైడ్రా అధికారుల సహకారం తీసుకుంటాం. ఆక్రమణల తొలగింపు కోసం బందోబస్తు కల్పించాలని ఇటీవల బంజారాహిల్స్ పోలీసులకు లేఖ రాశారు. పోలీసులు బందోబస్తు ఇవ్వగానే ఆక్రమణలను తొలగిస్తాం.
– అనితా రెడ్డి. తహసీల్దార్, షేక్‌పేట మండలం