బండ్లగూడ, సెప్టెంబర్ 9: ప్రొటోకాల్ పాటించకుండానే ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంపై స్థానిక కార్పొరేటర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సోమవారం ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ స్థానిక కార్పొరేటర్ రాక ముందే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి వెళ్లిపోయారు.
ఎమ్మెల్యే ప్రొటోకాల్ పాటించలేదని, తమకు చెప్పిన సమయం కంటే ముందే వచ్చి శంకుస్థాపన చేశారంటూ.. స్థానిక కార్పొరేటర్ మాలతీ నాగరాజు మరో కార్పొరేటర్ రవీందర్‌రెడ్డి కాలనీవాసులతో కలిసి శిలాఫలకం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాలతీ నాగరాజు మాట్లాడుతూ కార్పొరేషన్ పరిధిలో శంకుస్థాపనలు ఉన్నాయని, ఎమ్మెల్యే 10: 30 గంటలకు హాజరవుతున్నట్లు కమిషనర్ శరత్చంద్ర సమాచారమిచ్చారన్నారు.
కానీ ఎమ్మెల్యే పది నిమిషాల ముందే వచ్చి కార్పొరేటర్ లేకుండానే శంకుస్థాపనలు చేసి వెళ్లడంపై మాలతీ నాగరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. తను బీఆర్ఎస్ కార్పొరేటర్ కావడం వల్లే కావాలనే ఇలా చేశారని ఆరోపించారు. కమిషనర్ శరత్చంద్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులకు అండగా ఉంటూ.. ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారన్నారు. కాగా, విషయం తెలుసుకున్న మాజీ శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ కమిషనర్ శరత్చంద్రకు ఫోన్ చేసి.. ప్రొటోకాల్ అంశంలో అధికారుల తీరుపై మండిపడ్డారు.