జియాగూడ/సుల్తాన్ బజార్, ఏప్రిల్ 30 ః ఉస్మానియా దవాఖాన డాక్టర్లు మరోసారి తమ సత్తా చాటుకున్నారు. ైగ్లెకోజెన్ స్టోరేజ్ అనే అరుదైన డీసీజ్తో బాధపడుతున్న 18 నెలల చిన్నారికి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ శస్త్రచికిత్సను విజయవంతంగా చేశారు. కేవలం 10 కిలోల బరువు ఉన్న బాలుడికి సుమారు 14గంటల పాటు శ్రమించి 240 గ్రాముల లివర్ అమర్చారు. ప్రస్తుతం బాబు ఆరోగ్యం నిలకడగా ఉందని శస్త్ర చికిత్స బృందానికి నేతృత్వం వహించిన డాక్టర్ మధుసూదన్ వెల్లడించారు. నగరంలోని ఉడంగడ్డ ప్రాంతానికి చెందిన మహ్మద్ ఇర్పాన్, సాజియా దంపతుల 18 నెలల కుమారుడు అఫన్ గత కొంత కాలంగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు.
పిల్లాడు తరచుగా ఆకలితో ఏడుస్తుండడం, మత్తుగా ఉండడం, పొట్ట ఉబ్బరం వంటి లక్షణాలతో బాలుడిని తల్లిదండ్రులు ఉస్మానియా దవాఖానకు తీసుకొచ్చారు. రక్తంలో షుగర్స్ లెవల్స్ చాలా తక్కువగా ఉండడం, కాలేయం అసాధారణంగా విస్తరించి ఉండడాన్ని డాక్టర్లు గుర్తించారు. బాలుడి సమస్యలపై మరింత లోతుగా అధ్యయనం చేసి అతను ైగ్లెకోజెన్ స్టోరేజ్ (టైప్ – 3 ) అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్టుగా నిర్థారించారు. ఈ వ్యాధి శరీరంలో ైగ్లెకోజెన్ లోపంతో ఏర్పడిందని, దీని కారణంగా శరీరంతో నిల్వ ఉన్న శక్తిని వినియోగించుకోలేకపోవడం, తరచూ హైపోైగ్లెసీమియా, కాలేయం పెద్దగా అవడం, కండరాల బలహీనత వంటి సమస్యలు తలెత్తుతాయని డాక్టర్ మధుసుదన్ తెలిపారు.
చిన్నారి అఫన్కు అప్పటికే వ్యాధి ముదిరి పరిస్థితి విషమంగా మారడంతో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని డాక్టర్లు నిర్థారించారు. చిన్నారి తండ్రి నుంచి లివర్లోని కొంత భాగాన్ని సేకరించి, బాలుడికి అమర్చారు. డాక్టర్ మధుసుదన్ నేతృత్వంలో వైద్యుల బృందం సుమారు 14 గంటల పాటు ఈ క్లిష్టమైన శస్త్రచికిత్స చేసింది. అనంతరం చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉందని కోలుకుంటున్నాడని డాక్టర్ మధుసుదన్ వెల్లడించారు.
కార్పొరేట్ ఆసుపత్రిలో సుమారు 50 లక్షల వరకు చార్జ్ చేసే సర్జరీని ఒక్కరూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వ సహకారంతో రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చేశామని ఉస్మానియా సూపరింటెండ్ డాక్టర్ రాకేష్ సహాయ్ తెలిపారు. కేవలం 10 కిలోల బరువున్న చిన్నారికి అత్యంత ఆరుదైన శస్త్రచికిత్స నిర్వహించి ప్రాణాలు కాపాడిన ఉస్మానియా డాక్టర్ల బృందాన్ని ఆరోగ్య శాఖా మంత్రి దామోదర్ రాజనర్సింహ్మ అభినందించారు.