Liquor Bottles Seize | శేరిలింగపల్లి, ఫిబ్రవరి 6: (నమస్తే తెలంగాణ) : రోడ్డు పక్కన తోపుడు బండికొట్టుపై మద్యం బాటిల్ విక్రయిస్తున్న స్థావరంపై శేరిలింగంపల్లి సర్కిల్ జిహెచ్ఎంసి అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే మద్యం విక్రయాలు చేపడుతున్నారని స్థానికులు చేసిన ఫిర్యాదు మేరకు శేరిలింగంపల్లి సర్కిల్ ఏఎంహెచ్ఓ శ్రీకాంత్ రెడ్డి సిబ్బందితో కలిసి దాడి చేశారు. కొండాపూర్ జేవీజీ హిల్స్ ఫుట్‌పాత్ పక్కన రాజరాజేశ్వరి కాలనీలో తోపుడు బండిలో యధేచ్చగా మద్యం విక్రయాలు చేపడుతున్నట్లు కాలనీవాసులు డయల్ 100 నంబర్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సిబ్బందితో ఆయా ప్రాంతాల్లో దాడులు నిర్వహించి వివిధ బ్రాండ్లకు చెందిన 92 విస్కీ క్వార్టర్ బాటిళ్లను జీహెచ్ఎంసీ అధికారులు తోపుడు బండి కొట్టి నుంచి స్వాధీనం చేసుకున్నారు. తోపుడు బండిపై బెల్ట్ షాపు నిర్వహిస్తున్న ఓ మహిళపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు.
గచ్చిబౌలి ప్రిజం పబ్ కాల్పుల కేసులో మోస్ట్ వాంటెడ్ భక్తుల ప్రభాకర్ స్నేహితుడు సాఫ్ట్వేర్ ఇంజినీర్ రంజిత్‌ను గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు. కాల్పులు జరిగిన రోజు ప్రిజం పబ్ వద్ద బత్తుల ప్రభాకర్‌ను కారులో రంజిత్ దిపాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. 2023 నుంచి మోస్ట్ వాంటెడ్ ప్రభాకర్‌తో రంజిత్ సన్నిహితంగా ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు. ఐటీ ఉద్యోగి రంజిత్ అద్దెకు తీసుకున్న ఇంట్లోనే ప్రభాకర్ ఉంటున్నట్లు విచారణలో వెల్లడైంది. రంజిత్ బ్యాంకు ఖాతాలను ప్రభాకర్ ఉపయోగించినట్లు, చోరీలకు పాల్పడిన డబ్బులు రంజిత్ ఖాతాల్లోనే రెండేండ్లుగా ప్రభాకర్ డిపాజిట్ చేస్తూ ఎవరికీ అనుమానం రాకుండా లావాదేవీలు నడిపినట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు తెలుస్తున్నది. ప్రభాకర్ దొంగతనాలతో ఆయన చేసే చోరీలతో ఎంత వరకు సంబంధం ఉంది.. బీహార్‌లో ఆయుధాలు కొనుగోలు చేసిన ప్రభాకర్‌తో వెళ్ళింది ఎవరు అనే కోణాల్లో గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ద్విచక్ర వాహనాన్ని వాటర్ ట్యాంకర్ ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్ర గాయాలకు గురైన సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మం జిల్లా కొవ్వూరు మండలం చెన్నూరు గ్రామ నివాసి పెనుకొండ గోపాలకృష్ణ(33) బతుకు దెరువు నిమిత్తం ఐదేండ్ల క్రితం నగరానికి వలస వచ్చాడు. గౌలిదొడ్డి- కేశవ్‌నగర్‌లో నివసిస్తూ కూలి పని చేసుకుని జీవిస్తున్నాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పని నిమిత్తం స్నేహితుడు శ్రీకాంత్‌తో కలిసి బుధవారం సాయంత్రం కూకట్ పల్లి కోర్టుకు వెళ్లి తిరిగి వస్తున్నాడు. మార్గమధ్యలో వీరి ద్విచక్ర వాహనం మసీద్ బండ ప్రాంతానికి చేరుకోగానే వేగంగా దూసుకు వచ్చిన వాటర్ ట్యాంకర్ (టీఎస్ 07 యు 6710) ఢీకొంది. దీంతో గోపాలకృష్ణ అక్కడికక్కడే మృతి చెందగా తీవ్ర గాయాలతో శ్రీకాంత్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఈ మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.