సిటీబ్యూరో, జూన్ 3 (నమస్తే తెలంగాణ): ఓట్ల లెక్కింపు నేపథ్యంలో నేడు ఉదయం 6 నుంచి 5వ తేదీ ఉదయం 6 గంటల వరకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు, కల్లు కంపౌండ్లు మూసివేస్తూ ట్రై కమిషనరేట్లకు చెందిన కమిషనర్లు ఆదేశాలు జారీ చేశారు. అంతే కాకుండా ఓట్ల లెక్కింపు సందర్భంగా శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడకుండా ఉండేందుకు ముందుజాగ్రత్త చర్యగా మూడు కమిషనరేట్ల పరిధిలో నేడు ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6గంటల వరకు 144 సెక్షన్ విధిస్తున్నట్లు పోలీసు కమిషనర్లు వెల్లడించారు. ఆంక్షల నేపథ్యంలో మూడు కమిషనరేట్ల పరిధిలో ఎలాంటి ర్యాలీలు, ధర్నాలు, బహిరంగ సభలు, సమావేశాలు నిషేధమని, ఐదు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడరాదని ఆదేశాల్లో పేర్కొన్నారు. మద్యం విక్రయాలపై నిషేధం ఉన్న సమయంలో ఎవరైన నిబంధనలకు విరుద్ధంగా మద్యం సరఫరా చేసినా, బెల్టుషాపులు, ఇతర మార్గాల్లో మద్యం విక్రయాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు కమిషనర్లు హెచ్చరించారు.