
సిటీబ్యూరో, జనవరి 2 (నమస్తే తెలంగాణ):కోర్ సిటీలో ఉన్న మౌలిక వసతులను గ్రేటర్ చుట్టూ కొత్తగా విస్తరిస్తున్న ప్రాంతాల్లోనూ కల్పించేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలోనే కాకుండా హెచ్ఎండీఏ పరిధిలో ఔటర్ రింగు రోడ్డుకు ఇరువైపులా భారీ ఎత్తున నివాస ప్రాంతాలు ఏర్పాటవుతున్నాయి. ప్రణాళికా బద్దమైన పట్టణీకరణే లక్ష్యంగా పనిచేస్తున్న హెచ్ఎండీఏ విస్తరిస్తున్న ప్రాంతాల్లో మెరుగైన మౌలిక వసతుల కల్పనపై ప్రధానంగా దృష్టి సారించింది.
లింకు రోడ్ల అభివృద్ధికి.. జోన్ల వారీగా అధ్యయనం
హెచ్ఎండీఏ మాస్టర్‌ప్లాన్‌కు అనుగుణంగా నగరంలోని ఇన్నర్ రింగురోడ్డు నుంచి ఔటర్ రింగు రోడ్డు వరకు 33 రేడియల్ రోడ్లను నిర్మించాలని ప్రతిపాదించారు. ఇప్పటికే దాదాపు పూర్తయిన రేడియల్ రోడ్ల తరహాలోనే అవసరమైన, ట్రాఫిక్ రద్దీగా ఉండి సమస్యలు ఎదురవుతున్న ప్రాంతాల్లో లింకు రోడ్లను సైతం అభివృద్ధి చేసేందుకు జోన్ల వారీగా అధ్యయనం చేశారు. ఇప్పటికే శంకర్పల్లి జోన్ పరిధిలోని ఐటీ కారిడార్‌లో పలు లింకు రోడ్లను అభివృద్ధి చేశారు. అదే విధంగా మిగతా (దక్షిణాన శంషాబాద్, తూర్పున ఘట్కేసర్, ఉత్తరాన మేడ్చల్) జోన్ల పరిధిలో మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా రేడియల్ రోడ్లనుంచి కొత్తగా ఏర్పాటవుతున్న కాలనీలకు లింకు రోడ్లను విస్తరిస్తున్నారు.
ఇప్పటికే పురోగతిలో పనులు
ఇప్పటికే మేడ్చల్ జోన్ పరిధిలో బాచుపల్లి నుంచి మల్లంపేట మీదుగా బౌరంపేట వరకు రోడ్డు విస్తరణ పనులు పురోగతిలో ఉన్నాయి. అదేవిధంగా శంషాబాద్ జోన్‌లోని బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 6 రోడ్లను విస్తరించాలని నిర్ణయించారు. ఇలా ప్రతి జోన్ పరిధిలోనూ హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్‌ను పరిగణలోకి తీసుకొని రోడ్లను విస్తరించనున్నారు.
ఏడాదిలో పూర్తిచేయడమే లక్ష్యంగా..!
నగర శివారులో కొత్తగా ఏర్పాటవుతున్న కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీ, మంచినీరు, విద్యుత్, పార్కులు ఇలా అన్ని రకాల మౌలిక వసతులను ఏడాది వ్యవధిలో ఏర్పాటు చేసేందుకు హెచ్ఎండీఏ కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే జీహెచ్ఎంసీ పరిధి అవతల ఔటర్ రింగు రోడ్డు లోపల ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో క్షేత్ర స్థాయిలో రోడ్ల అభివృద్ధిపై సర్వే చేపట్టింది. వీటిని ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసేందుకు హెచ్ఎండీఏ నూతన ప్రణాళికను సిద్ధం చేసింది.
ఈ ఏడాదిలోనే పూర్తి చేయాలన్న లక్ష్యంతో..
శివారు పట్టణాల్లో, కొత్తగా ఏర్పాటువుతున్న కాలనీల్లో ఈ ఏడాదిలోనే మౌలిక వసతుల కల్పన పూర్తి చేయాలన్న లక్ష్యంతో హెచ్ఎండీఏ అధికారులు ఉన్నారు. అవసరమైన నిధులను హెచ్ఎండీఏ, రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపాలిటీలకు వచ్చే ఆదాయం నుంచి వెచ్చించనున్నారు. ఔటర్ రింగు రోడ్డు లోపలి ప్రాంతాల్లో మౌలిక వసతులను కల్పిస్తే వేగంగా ఆయా ప్రాంతాలు అభివృద్ధి చెందడంతో పాటు ప్రభుత్వానికి పన్నుల ద్వారా ఆదాయం, ప్రజలకు మెరుగైన జీవన శైలి సాధ్యమవుతుందని హెచ్ఎండీఏ ఇంజినీరింగ్ విభాగం అధికారులు తెలిపారు.
అభివృద్ధే లక్ష్యంగా.. మౌలిక వసతుల కల్పన
కొత్తగా ఏర్పాటయ్యే నివాస ప్రాంతాలకు రోడ్లు, మంచినీరు, డ్రైనేజీ, విద్యుత్, పార్కులు ఎంతో కీలకం. ఇప్పటి వరకు హెచ్ఎండీఏ పరిధిలోని శివారు ప్రాంతాల్లో ఇవన్నీ అరకొరగానే ఉన్నాయి. గేటెడ్ కమ్యూనిటీ, హెచ్ఎండీఏ అనుమతి పొందిన లేఅవుట్లలోనే మౌలిక వసతులు ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో మౌలిక వసతులు లేకపోవడంతో నివాసముండేందుకు ప్రజలు వెనుకడుగు వేస్తున్నారు. ఓఆర్ఆర్ లోపల ఉన్న స్థానిక మున్సిపాలిటీలైన జల్పల్లి, బడంగ్‌పేట, మీర్‌పేట, నార్సింగి, మణికొండ, నిజాంపేట, కొంపల్లి, శంషాబాద్, తుక్కుగూడ, ఆదిభట్ల, బోడుప్పల్, పీర్జాదిగూడ, పోచారం, దమ్మాయిగూడ, నాగారం, మేడ్చల్ మున్సిపాలిటీల్లో మెరుగైన మౌలిక వసతుల కల్పనకు హెచ్ఎండీఏ ప్రధానంగా దృష్టి సారించింది.