BRS | లింక్ రోడ్డును కలిపే దిశగా నిర్మాణం.. నర్సాపూర్ రాష్ట్ర రహదారితో పాటు ఎన్‌హెచ్-44 మేడ్చల్ జాతీయ రహదారి మార్గాలను కలిపే దిశంగా మార్గమధ్యలో ఉన్న జీడిమెట్ల పైపులైన్రోడ్డు లింక్‌రోడ్డు మార్గాన్ని కలిపేదిశగా తగు చర్యలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా ప్రస్తుతం రెండు లేన్ల విస్తరణతో ఉన్న ఈ రోడ్డును నాలుగు లేన్లకు భవిష్యత్‌లో విస్తరించే దిశగా మార్గమధ్యలో ఉన్న పైపులైన్రోడ్డు కల్వర్టును నాలుగు లేన్ల విస్తరణతో సుమారు రూ.56 కోట్ల వ్యయంతో కల్వర్టు విస్తరణ పనులతో పాటు అభివృద్ధి పనులు జరగనున్నాయి.
సిటీబ్యూరో/కుత్బుల్లాపూర్, మే 23 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పురుడుపోసుకున్న ప్రతిపాదనలు ఒక్కొక్కటీగా అందుబాటులోకి వస్తున్నాయి. ఎస్ఆర్డీపీలో భాగంగా 47 ప్రాంతాల్లో 37 చోట్ల ప్రాజెక్టు ఫలాలు అందుబాటులోకి రాగా…రెండో విడత ప్రతిపాదనలు కార్యరూపంలోకి వస్తున్నాయి. ఇందులో భాగంగానే జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలో పైపులైన్ రోడ్డు మార్గం విస్తరణకు మోక్షం లభించనున్నది. ఏండ్ల తరబడి వెంటాడుతున్న ట్రాఫిక్ సమస్యకు పూర్తిగా పరిష్కారం దొరకనున్నది. గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ హయాంలో పైపులైన్ రోడ్డు మార్గం విస్తరణకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీనికి తోడు దాదాపు రూ. 56 కోట్ల వ్యయంతో ఈ అభివృద్ధి పనులకు వచ్చే నెల 2న సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఎన్‌హెచ్- 44 జాతీయ రహదారి-నర్సాపూర్ రాష్ట్ర రహదారికి రోడ్లను కలిపే విధంగా మార్గమధ్యలో ప్రస్తుతం రెండు లైన్ల రోడ్డు ఉంది. దీనికి తోడు జీడిమెట్ల పారిశ్రామికవాడతో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్లే మార్గాలకు వెళ్లాలంటే నిత్యం పెద్దపెద్ద వాహనాలతో నిత్యం రద్దీగా ఉంటుంది. దీనికి తోడు మార్గమధ్యలో ఫాక్స్‌సాగర్ చెరువు నుంచి వెళ్లే ప్రధాన నాలా ఈ మార్గం మీదుగా ఉండటంతో పైపులైన్ రోడ్డు సమీపంలో ఉన్న వంతెన సింగిల్ దారితో ఏండ్ల కిందట నిర్మించి ఉంది. దీంతో ఇక్కడి నుంచి వెళ్లే వాహనాల సంఖ్య అధికం కావడంతో కల్వర్టు వద్ద సమీపంలో నిత్యం ట్రాఫిక్ సమస్య నెలకొంటున్నది. పెరిగిన జనాభాకు అనుగుణంగా వాహనాలు, రాకపోకలు అంతేస్థాయిలో పెరుగుతూ పోతున్నాయి.
సుచిత్ర జాతీయ రహదారి నుంచి మార్గమధ్యలో ఉన్న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ద్వారా జీడిమెట్ల పైపులైన్ రోడ్డు మీదుగా కుత్బుల్లాపూర్ సర్కిల్ కార్యాలయం హెచ్ఎంటీ రోడ్డు ప్రధాన రహదారికి ఈ దారీ అనుగుణంగా ఉంటుంది. నిత్యం ప్రజలతో పాటు గూడ్స్ లారీలు, ఇతర వ్యాపార సముదాయాల ట్రావెల్స్ వంటివి అనేకంగా ఇదే మార్గం గుండా రాకపోకలు సాగిస్తున్నాయి. మార్గమధ్యలో ఉన్న పైపులైన్ రోడ్డు వద్ద కల్వర్టు కేవలం రెండు లైన్ల కాలం రోడ్డు ఉండటంతో పాటుగా ఏండ్ల కిందట ఏర్పాటు చేసిన మార్గం కావడంతో పెద్దపెద్ద వాహనాలు వెళ్లే క్రమంలో ఏదైనా ప్రమాదం చోటు చేసుకునే పరిస్థితి ఉంది. ఈ క్రమంలో వాహనాలు ఒకటి లోపలికి వస్తే ఇతర వాహనాలు బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొన్నది.
వర్షాలు కురిసిన ప్రతిసారి పెద్ద ఎత్తున పక్కనే ఉన్న ఫాక్స్ సాగర్, దూలపల్లి, దుండిగల్ చెరువుల నుంచి వరద నీరు అధికంగా రావడంతో పైపులైన్ రోడ్డు మార్గంలో ఉన్న కల్వర్టు నాలా పూర్తిగా నిండిపోయి దర్శనమిస్తున్నది. ఈ క్రమంలో వాహనదారులు రాకపోకలు సాగించేందుకు అనువుగా లేకుండా పోతున్నది. ఎప్పుడు వరదలు వచ్చినా ఈ మార్గం గుండా వెళ్లే ప్రధాన నాలా కల్వర్టు నిండి పొంగిపర్లే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి క్రమంలో ఎప్పుడు ఏ ప్రమాదం చోటు చేసుకుంటుందో తెలియని అయోమయ పరిస్థితి. దీనికి తోడు కల్వర్టు నిర్మాణం ఏండ్ల కిందట చేపట్టడంతో పెద్ద పెద్ద వాహనాలు ఈ మార్గం మీదుగా వెళ్లే సమయంలో అతి జాగ్రత్తగా వెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ అజాగ్రత్తగా అతివేగంతో దూసుకొస్తే ఎలాంటి ప్రమాదమైన చోటు చేసుకునే అవకాశం లేకపోలేదు.