Hyderabad | నాంపల్లి క్రిమినల్ కోర్టులు, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ) : స్వంత కూతురిపై ఓ తండ్రి లైంగిక దాడికి పాల్పడిన కేసులో అతడికి జీవితఖైదు శిక్ష విధిస్తూ నాంపల్లిలోని ప్రత్యేక పోక్సో కోర్టు జడ్జి టి.అనిత సంచలన తీర్పు వెల్లడించారు. మైనర్ బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు కంచన్‌బాగ్ పోలీసు స్టేషన్ విచారణాధికారి వి.ఆనంద్ కేసు నమోదు చేసి వాంగ్మూలాల్ని నమోదు చేశారు. సాక్షాధారాల్ని సేకరించి 2023లో చార్జీషీట్‌ను కోర్టుకు సమర్పించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ రామ్‌రెడ్డి కథనం ప్రకారం మొదటి భార్యకు విడాకులిచ్చిన అనంతరం కూతురిపై శారీరకంగా లైంగిక దాడికి పాల్పడినట్టు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు.
కూతురిపై జరిగిన లైంగిక దాడి కేసులో బాలిక గర్భం దాల్చినట్టు వైద్య పరీక్షలో తెలిందని, ఫోరెన్సిక్ రిపోర్టులను సైతం కోర్టుకు సమర్పించారు. అదేవిధంగా తన సోదరిపై కూడా లైంగిక దాడికి పాల్పడినట్టు పేర్కొంది. గర్భం దాల్చకుండా గర్భనిరోధక మాత్రలిచ్చేవాడని, అయినప్పటికీ గర్భం దాల్చినట్టు వైద్య పరీక్షలో బయటపడడంతో అబార్షన్ కూడా చేయించాడని ఫిర్యాదులో వివరించారు. పూర్తి స్థాయి విచారణ చేపట్టిన కోర్టు నిందితుడు నేరం చేసినట్టు రుజువు కావడంతో శిక్షను ఖరారు చేసింది. రూ. 50 వేల జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుందని ఉత్తర్వులో పేర్కొంది కోర్టు.