చిక్కడపల్లి, జనవరి 2: రాష్ట్రంలోని అన్ని జిల్లా గ్రంథాలయాల్లో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు పరీక్షల విధి విధానాల పై అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు తెలంగాణ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డాక్టర్ ఆయాచితం శ్రీధర్ తెలిపారు. సోమవారం నగర కేంద్ర గ్రంథాలయంలో నూతన సంవత్సరం సందర్భంగా గ్రంథాలయ ఉద్యోగులు ఆయాచితం శ్రీధర్, శాఖ డైరెక్టర్ ఎస్.శ్రీనివాస్ చారి, నగర గ్రంథాలయం సంస్థ చైర్పర్సన్ ప్రసన్న రామ్మూర్తి, కార్యదర్శి పద్మజ, డిప్యూటీ డైరెక్టర్ హరిశంకర్లను సన్మానించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయాచితం శ్రీధర్ మాట్లాడుతూ… ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేస్తుందని దాని అనుకూలంగానే అన్ని పుస్తకాలను అభ్యర్థుల కోసం గ్రంథాలయాల్లో అందుబాటులో ఉంచుతామని తెలిపారు. గ్రంథాలయాలు గ్రామీణ పోటీ పరీక్షల అభ్యర్థులకు కల్పవృక్షాలుగా ఆధారిస్తూ, ఆశ్రమం ఇస్తున్నాయని తెలిపారు. అవగాహన సదస్సులో ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ 1,2, అధికారులతో ముఖాముఖీ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు, వారి అనుభావాలు, విజయాలను అభ్యర్థులకు వివరిస్తామని పేర్కొన్నారు. ఈ నెల 8న నగర గ్రంథాలయంలో అభ్యర్థుల కోసం అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు చైర్పర్సన్ ప్రసన్న రామ్మూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు అవినాశ్రావు, వెంకటేశ్ యాదవ్, జగన్మోహన్ రెడ్డి, సుకేశ్ తదితరులు పాల్గొన్నారు.